
ప్రతి ఇంటి కిచెన్‌లో శనగపిండి తప్పక ఉంటుంది. దీనిని రుచికరమైన బజ్జీలు, పకోడీలు, స్వీట్లు వంటి రకరకాల స్నాక్స్, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటాం. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా శనగ పిండిని ఉపయోగిస్తాం. ఈ శనగ పిండి ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే మార్కెట్‌లో మీరు కొనుగోలు చేసే శనగ పిండి స్వచ్ఛమైనదా? కాదా? అనే విషయం మీకెలా తెలుస్తుంది. ఎందుకంటే.. నేటి కాలంలో ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతిదీ కల్తీమయం అవుతున్నాయి. వ్యాపారులు లాభాల కోసం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మార్కెట్లో కొనుగోలు చేసే కల్తీ శనగ పిండిని వినియోగించడం వల్ల కీళ్ల నొప్పులు, వైకల్యం, కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే నకిలీ శనగ పిండిని ఈ కింది చిట్కాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఎలాగంటే..
శనగ పిండి నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం ద్వారా సులువుగ తెలుసుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండిని తీసుకొని, నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ పిండి ఎర్రగా మారితే, అది కల్తీ అయిందని అర్థం.
అలాగే నిమ్మకాయను ఉపయోగించి కూడా శనగ పిండి నిజమైనదా లేదా నకిలీదా అనే విషయం సులభంగా గుర్తించవచ్చు. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి తీసుకోవాలి. దానికి సమాన మొత్తంలో నిమ్మరసం కలపాలి. ఆ తరువాత దానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం జోడించాలి. ఐదు నిమిషాల తర్వాత శనగ పిండి గోధుమ లేదా ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.