
ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడినీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, బరువు తగ్గిస్తుందని ఒక నమ్మకం. అయితే వేడినీరు నిజంగానే అద్భుతాలు’ చేస్తుందా? లేక ఇదంతా కేవలం ఒక మానసిక తృప్తి మాత్రమేనా..? అమెరికాకు చెందిన హఫ్‌పోస్ట్ నివేదిక, వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఇసయ్య షుస్టర్ అభిప్రాయం ప్రకారం.. వేడి పానీయాలు జీర్ణవ్యవస్థలోని కండరాలను కొంతవరకు సడలిస్తాయి. దీనివల్ల ఆహారం అన్నవాహిక ద్వారా సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్‌ను ప్రేరేపించడం ద్వారా పెద్ద ప్రేగు కదలికలను పెంచుతుంది. తద్వారా మలబద్ధకం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
చాలామంది నమ్మే మరో విషయం.. వేడినీరు తాగితే కొవ్వు కరుగుతుందని. కానీ చికాగో యూనివర్సిటీ మెడిసిన్ డాక్టర్ వెనెస్సా బుయ్ ప్రకారం.. దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. మన శరీరం సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ వద్ద మెరుగ్గా పనిచేస్తుంది. మరీ ఎక్కువ వేడి లేదా అతి చల్లని నీరు తాగడం వల్ల కొన్నిసార్లు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. బరువు తగ్గడం అనేది కేవలం నీటి ఉష్ణోగ్రత మీద కాకుండా మన జీవనశైలి, నిద్ర, హార్మోన్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.
వైద్యుల సలహా ప్రకారం.. నీరు ఏ ఉష్ణోగ్రతలో తాగుతున్నామనే దానికంటే.. రోజంతా శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్‌గా ఉంచుతున్నామనేది ముఖ్యం. మీరు వేడినీరు తాగడం వల్ల కూల్ డ్రింక్స్ లేదా షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉంటే అది పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తే.. ఆ అలవాటును కొనసాగించడంలో తప్పు లేదు. కానీ అది ఏదో ఒక మాయ చేస్తుందని ఆశించడం మాత్రం భ్రమ మాత్రమే.
అతి వేడి లేదా అతి చల్లని నీటి కంటే, శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఉష్ణోగ్రతలో నీరు తాగడం మంచిది. జీర్ణక్రియ మెరుగుపడాలంటే కేవలం నీటిపైనే కాకుండా సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.