AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే.. లైట్ తీసుకుంటే ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాల్సిందే..

చాలామంది ఉదయాన్నే మోషన్ సాఫీగా అవ్వకపోతే.. 'ఏముందిలే, కాస్త వేడి చేసింది' అని లైట్ తీసుకుంటారు. మెడికల్ షాపుకి వెళ్లి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని తాత్కాలికంగా సర్దుకుపోతుంటారు. కానీ, మీరు చేస్తున్న ఈ చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్తుందని తెలుసా? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే.. లైట్ తీసుకుంటే ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాల్సిందే..
Is Constipation Leading To Severe Diseases
Krishna S
|

Updated on: Jun 29, 2026 | 11:52 AM

Share

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అత్యంత సాధారణ జీర్ణ సమస్య.. మలబద్ధకం. మారిన జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వల్ల చాలామంది దీని బారిన పడుతున్నారు. అయితే మెజారిటీ ప్రజలు మలబద్ధకాన్ని ఒక చిన్న సమస్యగా కొట్టిపారేస్తూ నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీర్ఘకాలిక మలబద్ధకం అనేది కేవలం పైల్స్ సమస్యకే పరిమితం కాదు ఇది శరీరంలో మరికొన్ని ప్రమాదకరమైన జబ్బులకు లెంక లాంటిదని హెచ్చరిస్తున్నారు. అసలు మలబద్ధకం వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటి? ఏయే సంకేతాలను మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మలబద్ధకం వల్ల ముంచుకొచ్చే ఇతర జబ్బులు ఇవే

మలవిసర్జన సజావుగా సాగక గట్టిపడటం వల్ల చాలామంది టాయిలెట్‌లో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల పాయువు కింది భాగంలోని సిరలు ఉబ్బి పైల్స్ దారితీస్తుంది. అయితే దీనితో పాటు వచ్చే మరికొన్ని తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి.

అనల్ ఫిషర్స్: మలవిసర్జన సమయంలో పదేపదే ముక్కడం వల్ల మలద్వారం వద్ద చర్మం చీలిపోతుంది. దీనివల్ల మోషన్ కి వెళ్లినప్పుడు తీవ్రమైన మంట, నొప్పి, రక్తస్రావం జరుగుతుంది.

రెక్టల్ ప్రోలాప్స్: దీర్ఘకాలంగా తీవ్రమైన మలబద్ధకంతో బాధపడేవారిలో, పురీషనాళం మలద్వారం గుండా కొద్దిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది.

ఫేకల్ ఇంపాక్షన్: మలబద్ధకం ఎక్కువ కాలం కొనసాగితే, మలం పూర్తిగా గట్టిపడిపోయి పెద్దప్రేగులోనే ఇరుక్కుపోతుంది. ఇది జీర్ణవ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తుంది.

తీవ్ర అజీర్తి సమస్యలు: ఇది కడుపు ఉబ్బరం, తీవ్రమైన గ్యాస్, కడుపు నొప్పి, ఆకలి మందగించడానికి కారణమవుతుంది.

అస్సలు నిర్లక్ష్యం చేయకూడని ప్రమాదకర సంకేతాలు

మలబద్ధకంతో పాటు ఈ లక్షణాలు గనుక కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి లోపల ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు..

  • మలవిసర్జన సమయంలో తట్టుకోలేనంత తీవ్రమైన నొప్పి రావడం.
  • మలంలో రక్తం పడటం.
  • నిరంతరాయంగా కడుపు నొప్పి లేదా కడుపు ఉబ్బరం తగ్గకపోవడం.
  • ఎలాంటి డైట్, వ్యాయామం చేయకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.
  • తరచుగా వాంతులు కావడం లేదా అసలు మలవిసర్జనే జరగకపోవడం.
  • మలబద్ధకంతో పాటు జ్వరం, నీరసం, రక్తహీనత వంటి లక్షణాలు ఉండటం.

ప్రేగులను ఆరోగ్యంగా ఉంచే నివారణ చర్యలు..

మలబద్ధకం సమస్య నుండి శాశ్వతంగా బయటపడటానికి, మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఈ సింపుల్ లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోండి..

పీచుపదార్థాలు: మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి మలాన్ని సాఫీగా సాగేలా చేస్తాయి.

పుష్కలంగా నీరు: రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేయడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగవుతాయి.

జంక్ ఫుడ్‌కు నో: బేకరీ ఫుడ్స్, మైదాతో చేసిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్స్ తీసుకోవడాన్ని పూర్తిగా పరిమితం చేసుకోండి.

తొందరపాటు వద్దు: మలవిసర్జన చేయాలనే కోరికను ఎప్పుడూ బలవంతంగా అణచివేయకండి.

Follow Us