Liver: చికెన్, మటన్ లివర్‌ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో జాగ్రత్త మరి.. ఎందుకంటే..

మటన్, చికెన్.. లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత, కంటి చూపు, రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యానికి ఇది ఉత్తమమైనది. అయితే, అధిక విటమిన్ ఎ, విషపూరిత లోహాలు వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మోతాదు మించితే విషంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్, చికెన్ లివర్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

Liver: చికెన్, మటన్ లివర్‌ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో జాగ్రత్త మరి.. ఎందుకంటే..
Chicken Mutton Liver

Updated on: Jan 31, 2026 | 9:48 AM

నాన్‌వెజ్ ప్రియులు.. చికెన్, మటన్‌ను ఇష్టంగా తింటారు.. ఇంకా.. కోడి లేదా మేక మాంసంతోపాటు.. ఆర్గాన్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది.. వీటిలో ఎన్నో పోషకాలు దాగుంటాయి.. అలాగే.. రక్తహీనతను దూరం చేస్తాయి.. మాంసాహారంలో లివర్ (కాలేయం) కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన ఆహారమే కాదు.. అనేక పోషక విలువలతో నిండిన సూపర్ ఫుడ్ గా కూడా పరిగణిస్తారు. అయితే, లివర్ ను మితంగా తీసుకుంటే అమృతం వలె పనిచేస్తుంది.. కానీ మోతాదు మించితే విషంగా మారే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

మటన్ లేదా చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి9 (ఫోలేట్), విటమిన్ బి12, జింక్, కోలిన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

రక్తహీనత నివారణ: లివర్ ఇనుముకు గొప్ప వనరు. తీవ్ర రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి ఇది మంచిగా పనిచేస్తుంది. శరీర కణాలకు ప్రాణవాయువును చేరవేయడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ఇనుము అవసరం. ఆయుర్వేదంలో దీనిని రక్తవృద్ధికరం గా వర్ణిస్తారు.

కంటి ఆరోగ్యం: విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి కీలకమైన పోషకం. లివర్ లో అధికంగా ఉండే విటమిన్ ఎ రేచీకటిని తగ్గించడంలో, శుక్లాల (కాటరాక్ట్) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీనిని చక్షుష్య గుణం గా పేర్కొంటారు.

రోగనిరోధక శక్తి: లివర్ శరీరంలో రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. దీంట్లోని పోషకాలు వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని ఓజస్సు ను పెంచే ఆహారంగా పరిగణిస్తారు.

మెదడు – నాడీ వ్యవస్థ ఆరోగ్యం: విటమిన్ బి12 మరియు కోలిన్ మెదడు ఆరోగ్యాన్ని, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో లివర్ సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా విటమిన్ బి12 అవసరం.

లివర్ అధిక వినియోగం – ప్రమాదాలు, జాగ్రత్తలు:

  • లివర్ ఎంత ఆరోగ్యకరమైనదైనా, అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
  • చికెన్ లేదా మటన్ లివర్లో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల లివర్లో రోజువారీ సిఫార్సు చేయబడిన విటమిన్ ఎ మోతాదుకు 10 రెట్లు అధికంగా ఉండవచ్చు. విటమిన్ ఎ కొవ్వులో కరిగే విటమిన్ కాబట్టి, ఇది శరీరంలో నిల్వ ఉండి విష ప్రభావాలను కలిగిస్తుంది. రోజుకు 3,000 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా విటమిన్ ఎ ను దీర్ఘకాలం తీసుకుంటే కాలేయ సమస్యలు, ఎముకల బలహీనత వంటి అనారోగ్యాలు రావచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
  • రక్తహీనతతో బాధపడే గర్భిణీలు డాక్టర్ సూచన వేమరకు లివర్ తీసుకోవచ్చు.. అయితే.. ఎక్కువగా తింటే.. అధిక విటమిన్ ఎ పుట్టబోయే బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు (బర్త్ డిఫెక్ట్స్) కారణం కావచ్చు.
  • జంతువుల కాలేయం శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను వడపోస్తుంది. అందుకే, లివర్ లో సీసం (Lead), కాడ్మియం (Cadmium), పాదరసం (Mercury), ఆర్సెనిక్ (Arsenic) వంటి భారీ లోహాలు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ లోహాలు మన శరీరంలో పేరుకుపోతే, కాలేయంపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యలు, ఎముకల క్షీణతకు కారణం కావచ్చు. కాడ్మియం ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీసి మూత్రపిండాల వైఫల్యం, ఊపిరితిత్తుల పనితీరు క్షీణత, ఎముకల లోపాలకు దారితీస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం..

లివర్ ను ఆహార ఔషధం వలె పరిగణించాలి.. ఆహారం వలె కాదు. ప్రతి ఔషధానికి ఒక మోతాదు ఉన్నట్లే, లివర్ కు కూడా ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. పెద్దలు వారానికి ఒకసారి 50-75 గ్రాముల ఉడికించిన లివర్ ను మాత్రమే తీసుకోవాలి. అలాగే.. ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లివర్ ను అస్సలు పెట్టకూడదు. చిన్నపిల్లలకు కూడా పరిమిత మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన అవగాహనతో, మితమైన మోతాదులో లివర్ ను వినియోగించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..