IRCTC Ooty Tour: వెళ్లొద్దామా ఊటీ.. ఆరు రోజులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ.. వివరాలు ఇవి

కుటుంబంతో కలిసి చక్కటి చల్లని ప్రదేశం అయిన తమిళనాడులోని ఊటీ వెళ్లి వచ్చేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఊటీకి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అతి తక్కువ ధరలో మంచి ఆప్షన్లను అందిస్తోంది.

IRCTC Ooty Tour: వెళ్లొద్దామా ఊటీ.. ఆరు రోజులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ.. వివరాలు ఇవి
Ooty Tourism

Updated on: May 31, 2023 | 6:30 AM

వేసవి కాలం దాదాపు పూర్తయిపోతుంది. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరుచుకునే సమయం దగ్గరపడింది. ఇప్పటికే చాలా మంది టూర్లకు వెళ్లి వచ్చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకూ ఎటువంటి టూర్లకు వెళ్లకపోతే మీకో మంచి అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి చక్కటి చల్లని ప్రదేశం అయిన తమిళనాడులోని ఊటీ వెళ్లి వచ్చేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఊటీకి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అతి తక్కువ ధరలో మంచి ఆప్షన్లను అందిస్తోంది. ట్రైన్ తో పాటు స్థానికంగా బస, ఆహారం వంటి సదుపాయాలు కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పర్యాటక స్వర్గధామం ఊటీ..

తమిళనాడులోని ఊటీ పర్యాటక స్వర్గధామం. ఇక్కడున్న పచ్చిక బయళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలో అందురూ ఈ హిల్ స్టేషన్ల రాణి పిలుచుకునే ఈ ఊటీని సందర్శించేందుకు మొగ్గుచూపుతారు. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ప్యాకేజీలో ఊటీతో పాటు కూనూర్‌ తదితర ప్రదేశాలను ఇందులో చుట్టిరావొచ్చు. ఈ టూర్‌ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.

ప్యాకేజీ ఇలా..

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,500, ట్విన్ షేరింగ్‌కు రూ.13,580, కంఫస్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,960, డబుల్ షేరింగ్‌కు ధర రూ.16,030 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఊటీలో మూడు రాత్రులు బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

టూర్‌ ఇలా..

ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న అల్టిమేట్ ఊటీ టూర్ ప్యాకేజీలో ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

మొదటి రోజు: ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. మొదటి రోజంతా ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు: ఈ రైలు రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి వాహనంలో ఊటీకి బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఊటీ లోకల్ టూర్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ చూడొచ్చు. రాత్రికి ఊటీలోనే బస.

మూడో రోజు: సైట్ సీయింగ్ ఉంటుంది. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి.

నాలుగో రోజు: కూనూర్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఊటీ నుంచి కూనూర్ వెళ్లి ప్రకృతి అందాలు, టూరిస్ట్ స్పాట్స్ చూడొచ్చు. సాయంత్రానికి తిరిగి ఊటీ చేరుకుంటారు. ఖాళీ సమయం ఉంటే షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

ఐదో రోజు: ఊటీ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

ఆరో రోజు: ఆరోరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు పర్యాటకులు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే కుటుంబంతో ఊటీ వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకోండి. అక్కడి అందాలను ఆస్వాదించి, కొత్త విద్యా సంవత్సరాన్ని సరికొత్తగా, రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..