Yoga Day: పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? ప్రతి అమ్మాయి తెలుసుకోవల్సిన నిజాలు ఇవే..!

Yoga During Menstruation: పీరియడ్స్ సమయంలో యోగా చేయకూడదనేది చాలా మంది మహిళల్లో ఉన్న సాధారణ అపోహ. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన జాగ్రత్తలతో యోగా చేయడం సురక్షితమే కాకుండా నెలసరి నొప్పులు, కడుపు ఉబ్బరం, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని వారు చెబుతున్నారు..

Yoga Day: పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? ప్రతి అమ్మాయి తెలుసుకోవల్సిన నిజాలు ఇవే..!
Yoga During Menstruation

Updated on: Jun 19, 2026 | 1:34 PM

యోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అయితే రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో యోగా చేయకూడదనే అపోహ చాలా మంది మహిళల్లో ఉంది. దీంతో ఆ రోజుల్లో యోగాకు దూరంగా ఉండటం కనిపిస్తుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన మార్గదర్శకత్వంతో యోగా చేయడం పీరియడ్స్ సమయంలో కూడా సురక్షితమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో అంషులా కపూర్, యోగా ట్రైనర్ అంషుకా పార్వాణీ పలు అపోహలను ఖండించారు. పీరియడ్స్ సమయంలో యోగా చేయకూడదనేది పూర్తిగా అపోహేనని స్పష్టం చేశారు.

పీరియడ్స్‌లో యోగా చేయొచ్చా..?

చాలామంది మహిళలు పీరియడ్స్‌ సమయంలో యోగాకు దూరంగా ఉంటారు. అయితే అంషులా కపూర్ మాత్రం పీరియడ్స్‌లో ఉన్నా, లేకపోయినా యోగా సాధనను ఆపాల్సిన అవసరం లేదని అంటున్నారు. పీరియడ్స్ టైంలో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచే ఇన్‌వర్షన్ ఆసనాల విషయంలో మాత్రం శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలని ఆమె సూచిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం అనిపించినా వాటిని చేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. అయితే పీరియడ్స్ సమయంలో ఇలాంటి ఆసనాలు చేయకూడదని చెప్పే శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని అంషుకా పార్వాణీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ట్విస్ట్‌లు చేయడం సురక్షితమేనా?

పీరియడ్స్ సమయంలో యోగా ట్విస్ట్‌లు చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలై మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. పీరియడ్స్ సమయంలో యోగా చేస్తే రుతుచక్రం మారిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కూడా అపోహేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి రుతుచక్రం క్రమబద్ధంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

పీరియడ్స్ సమయంలో యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • పీరియడ్స్ నొప్పులు, కడుపు ఉబ్బరం, నడుము నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం
  • శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలై మానసిక ఉల్లాసం
  • ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటం
  • రుతుచక్రం క్రమబద్ధంగా మారేందుకు సహకారం
  • శరీరానికి తేలిక, విశ్రాంతి కలగడం

ఏ ఆసనాలను నివారించాలి?

యోగా గురువు మన్సూర్ బలౌచ్ అభిప్రాయం ప్రకారం.. సాధారణ స్ట్రెచింగ్ ఆసనాలు పీరియడ్స్ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా చైల్డ్ పోజ్, డౌన్‌వర్డ్ డాగ్, లెగ్స్ అప్ ది వాల్ వంటి ఆసనాలు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. అయితే బో పోజ్, హెడ్‌స్టాండ్, హ్యాండ్‌స్టాండ్ వంటి క్లిష్టమైన అడ్వాన్స్‌డ్ ఆసనాలను పీరియడ్స్ సమయంలో నివారించడం మంచిదని ఆయన సూచించారు. ఈ సమయంలో మహిళల శరీరం మరింత సున్నితంగా ఉండటంతో అధిక ఒత్తిడి కలిగించే ఆసనాలు అసౌకర్యాన్ని పెంచే అవకాశం ఉందని వివరించారు. కాబట్టి పీరియడ్స్ సమయంలో యోగా చేయకూడదనే అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి మహిళ తన శరీర పరిస్థితిని గమనిస్తూ సౌకర్యంగా అనిపించే ఆసనాలనే చేయడం ఉత్తమం. సరైన యోగా సాధన రుతుక్రమ సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Follow Us