AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పెట్టిన ఇడ్లీ పిండి ఉదయానికి పొంగలేదా.. ఈ ఒక్కటి కలిపితే సాఫ్ట్ ఇడ్లీలు పక్కా..

ఉదయం లేచి చూసేసరికి రాత్రి రుబ్బి పెట్టిన ఇడ్లీ పిండి అస్సలు పొంగలేదా? ఛ.. ఇవాళ ఇడ్లీలు రాళ్లలా వస్తాయి అని కంగారు పడుతున్నారా? అయితే వెంటనే ఆ పిండిని పారేయకండి. ఎలాంటి సోడా అవసరం లేకుండా వంటింట్లో ఉండే ఒక్క పదార్థం కలిపితే చాలు.. నిమిషాల్లో పిండి సెట్ అయి దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఆ సీక్రెట్ టిప్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రాత్రి పెట్టిన ఇడ్లీ పిండి ఉదయానికి పొంగలేదా.. ఈ ఒక్కటి కలిపితే సాఫ్ట్ ఇడ్లీలు పక్కా..
How To Make Soft Idli Without Fermentation
Krishna S
|

Updated on: Sep 22, 2026 | 8:18 PM

Share

ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి మెత్తటి ఇడ్లీలను సాంబార్ లేదా చట్నీతో తింటే ఆ మజానే వేరు. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టిఫిన్లలో ఇడ్లీకి ఎప్పుడూ మొదటి స్థానమే. అయితే ఈ మెత్తటి ఇడ్లీలు రావాలంటే పిండి సరిగ్గా పులిసి, బాగా పొంగడం ఎంతో ముఖ్యం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లేదా పిండి రుబ్బే సమయంలో జరిగే చిన్న చిన్న తేడాల వల్ల రాత్రంతా ఉంచినా ఉదయానికి పిండి అస్సలు పొంగదు. అలాంటప్పుడు ఇడ్లీలు గట్టిగా రాళ్లలా వస్తాయని గృహిణులు తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.

సాధారణంగా ఇడ్లీల కోసం మినపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకుంటారు. ఆ తర్వాత అందులో నానబెట్టి, పిండిన ఇడ్లీ రవ్వను గానీ లేదా రుబ్బిన బియ్యపు పిండిని గానీ కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కిణ్వ ప్రక్రియ కోసం ముందు రోజు రాత్రంతా ఉంచుతారు. సహజంగా రాత్రి సమయంలో బ్యాక్టీరియా చర్యల వల్ల పిండి పులిసి, రెట్టింపు పరిమాణంలో పొంగుతుంది. ఇలా పిండి బాగా పొంగితేనే ఆవిరిపై ఉడికించినప్పుడు ఇడ్లీలు మృదువుగా, స్పంజ్ లాగా వస్తాయి. కానీ చల్లటి గాలులు వీచే వర్షాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల పిండి సహజంగా పొంగడం కష్టమవుతుంది.

ఇలాంటి సమయాల్లో పిండిని వృథాగా పారేయాల్సిన పనిలేదు.. అలాగే గట్టి ఇడ్లీలు తిని ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. వంటింట్లో సులభంగా దొరికే ఒకే ఒక్క పదార్థంతో ఈ సమస్యను క్షణాల్లో పరిష్కరించవచ్చని వంట నిపుణులు సూచిస్తున్నారు. అదే చిక్కటి పుల్లటి పెరుగు లేదా మజ్జిగ. పిండి సరిగ్గా పొంగలేదని గుర్తించిన వెంటనే, ఒక కప్పు చిక్కటి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇందులో అస్సలు నీళ్లు కలపకూడదు.

ఈ విధంగా గిలకొట్టిన చిక్కటి పెరుగు లేదా మజ్జిగను పులియని ఇడ్లీ పిండిలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఆ తర్వాత పాత్రపై మూత పెట్టి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ సమయంలో పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, సహజ బ్యాక్టీరియా తక్షణ కిణ్వ ప్రక్రియకు తోడ్పడి పిండికి అవసరమైన ఫ్లఫీనెస్‌ను అందిస్తాయి.

పిండి నానే ఈ 15-20 నిమిషాల వ్యవధిలోనే మీరు ఇడ్లీ పాత్రను సిద్ధం చేసుకోవడం లేదా టిఫిన్‌కు కావలసిన వేడివేడి సాంబార్, పల్లీ, కొబ్బరి చట్నీని తయారు చేసుకోవచ్చు. ఆ సమయం పూర్తయ్యాక మూత తీసి, పిండిని మరోసారి మెల్లగా కలిపి నేరుగా ఇడ్లీ ప్లేట్లలో వేసి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి పులియకపోయినా ఇడ్లీలు రాయిలా మారకుండా ఎంతో మృదువుగా, కమ్మటి రుచితో నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తాయి. ఇకపై పిండి పొంగలేదనే బాధ లేకుండా ఈ చిన్న వంటింటి చిట్కాతో పర్ఫెక్ట్ ఇడ్లీలను రెడీ చేసుకోవచ్చు.

Follow Us