కొత్తిమీర ఆకులలో కాదు అసలు రుచి ఉండేది ఆ భాగంలోనే.. చెఫ్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..?

వంట ఏదైనా సరే.. చివర్లో కొంచెం కొత్తిమీర పడితేనే ఆ రుచే వేరు.. కానీ మనం కొత్తిమీరను సరిగ్గా వాడుతున్నామా? సాధారణంగా మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర ఆకులను కోసి కాండాలను, వేర్లను చెత్తబుట్టలో పారేయడం మనందరికీ ఉన్న పాత అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల మీరు వంటలోని అసలైన రుచిని పారేస్తున్నారని హెచ్చరిస్తున్నారు.

కొత్తిమీర ఆకులలో కాదు అసలు రుచి ఉండేది ఆ భాగంలోనే.. చెఫ్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..?
How To Use Coriander Correctly

Updated on: Jan 25, 2026 | 9:55 PM

సాధారణంగా మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చాక ఏం చేస్తాం..? కేవలం ఆకులను మాత్రమే తుంచుకుని, కాండాలను, వేర్లను చెత్తబుట్టలో వేస్తాం. కానీ మీరు చెత్త అని పారేస్తున్న ఆ కాండాల్లోనే అసలైన రుచి దాగి ఉందని మీకు తెలుసా..? కొత్తిమీరను వంటల్లో ఎలా వాడాలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన కేవలం ఆకుల్లోనే ఉండదని రణవీర్ బ్రార్ చెబుతున్నారు. ఆయన లెక్క ప్రకారం..80శాతం రుచి కొత్తిమీర కాండాల్లో ఉంటుంది. 20శాతం రుచి దాని వేర్లలో ఉంటుంది. మనం వాడే ఆకులు కేవలం అలంకరణ కోసం, తేలికపాటి పూల సువాసనను జోడించడం కోసం మాత్రమే ఉపయోగపడతాయని ఆయన వివరించారు.

ఏ భాగాన్ని ఎప్పుడు వాడాలి?

వంట చేసేటప్పుడు కొత్తిమీరలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుందని, అది తెలిస్తేనే వంటకు సరైన రుచి వస్తుందని చెఫ్ రణవీర్ సూచించారు.

కొత్తిమీర వేర్లు: మీరు సాంబార్, సూప్స్ లేదా మాంసాహార వంటకాలు చేస్తున్నప్పుడు.. అంటే ఏ వంటకైతే 2 నుండి 3 గంటల సుదీర్ఘ సమయం పడుతుందో, అప్పుడు కొత్తిమీర వేర్లను ఉపయోగించాలి. ఇవి ఎక్కువ సేపు ఉడికినా తమ రుచిని కోల్పోకుండా, వంటకానికి ఒక లోతైన రుచిని ఇస్తాయి.

కొత్తిమీర కాండాలు: గ్రేవీ కూరలు లేదా మధ్యస్థ సమయం ఉడికించే వంటకాల్లో కాండాలను చిన్నగా తరిగి వేయాలి. కనీసం 15 నుండి 20 నిమిషాలు ఉడికితేనే కాండాల్లోని బలమైన రుచి కూరకు పడుతుంది.

కొత్తిమీర ఆకులు: ఆకులు చాలా మృదువుగా ఉంటాయి. వీటిని వంట మొదట్లోనే వేస్తే వాటి సువాసన పోతుంది. అందుకే వంట పూర్తయి స్టవ్ కట్టేసే ముందు ఆకులను చల్లడం వల్ల ఆ తేలికపాటి సువాసన వంటకంలో నిలిచి ఉంటుంది.

ఇకపై కొత్తిమీరను కేవలం ఆకుల కోసమే కాకుండా, పూర్తి మొక్కను వంటల్లో వాడటం అలవాటు చేసుకోండి. చెఫ్ రణవీర్ బ్రార్ చెప్పినట్లు ఆ చెత్త అనుకునే కాండాలే మీ వంటను మాస్టర్ చెఫ్ రేంజ్ రుచికి తీసుకెళ్తాయి.