ఇలా చేస్తే చాలు.. 6 నెలలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది.. సూపర్ ట్రిక్స్..
అల్లం-వెల్లుల్లి పేస్ట్ త్వరగా పాడైపోతోందా? నల్లబడిపోయి రుచి, సువాసన కోల్పోతోందా? అయితే మీరు తయారుచేసే పద్ధతిలోనే లోపం ఉంది. నీళ్లు కలపకుండా చేసే ఒక చిన్న సీక్రెట్ ట్రిక్ తెలిస్తే చాలు.. మీ వంటింట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలలైనా అప్పుడే నూరినట్లు ఫ్రెష్‌గా ఉంటుంది.

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది ప్రత్యేక స్థానం. నాన్‌వెజ్ కూరలైనా, వెజ్ బిర్యానీలు, కుర్మాలు అయినా సరే… అల్లం వెల్లుల్లి ముద్ద లేకపోతే ఆ రుచి, ఘాటైన సువాసన రావు. అయితే ప్రతిరోజూ వంట చేసే ముందు అల్లం, వెల్లుల్లి తొక్కలు తీసి నూరడం మహిళలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. సమయం ఆదా అవుతుందని ఒకేసారి ఎక్కువ మొత్తంలో గ్రైండ్ చేసి పెట్టుకుంటే.. కొన్ని రోజులకే అది పచ్చగా లేదా నల్లగా మారిపోవడం, పుల్లటి వాసన రావడం, ఫంగస్ పట్టడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అసలు ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా, ఇంట్లో సహజంగా దొరికే మూడు వస్తువులను ఉపయోగించి పేస్ట్ చేస్తే నెలల తరబడి తాజాగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా?
కావలసిన పదార్థాలు – కొలతలు
200 గ్రాముల అల్లం, 200 గ్రాముల వెల్లుల్లికి సుమారు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆవనూనె, అర టీస్పూన్ పసుపు పొడి, ఒక టీస్పూన్ ఉప్పు అవసరం. ఇందులో ఉపయోగించే నూనె, ఉప్పు సహజ ప్రిజర్వేటివ్‌లుగా పనిచేసి పేస్ట్ పాడవకుండా కాపాడతాయి.
తయారీ విధానం – స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
మొదటి దశ: అల్లం, వెల్లుల్లి తొక్కలు తీసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్‌పై వీటిని పరచి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టాలి. అల్లం, వెల్లుల్లిలో ఏమాత్రం తడి లేదా తేమ ఉన్నా బ్యాక్టీరియా, బూజు చేరి పేస్ట్ త్వరగా పాడైపోతుంది. కాబట్టి పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం.
రెండో దశ: బాగా ఆరిన అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కోసి, వెల్లుల్లి రెబ్బలతో కలిపి మిక్సీ జార్‌లో వేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. ఎలాంటి నీళ్లు పోయకూడదు. మొదట మిక్సర్‌ను పల్స్ మోడ్‌లో ఒకట్రెండు సార్లు తిప్పి ముక్కలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
మూడో దశ: ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉప్పు, పసుపు, 3 స్పూన్ల ఆవనూనె కలపాలి. ఉప్పు తేమను నియంత్రిస్తుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి రంగు మారకుండా కాపాడుతుంది. ఆవనూనె సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేసి సువాసనను కాపాడుతుంది. ఇప్పుడు మిక్సీని బాగా తిప్పి మెత్తని, క్రీమీ పేస్ట్‌లా చేసుకోవాలి.
ఎక్కువ కాలం నిల్వ ఉంచే సీక్రెట్ టిప్స్
- ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా శుభ్రమైన, తడి ఏమాత్రం లేని ఎయిర్‌టైట్ గాజు సీసాలో ఈ పేస్ట్‌ను నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి.
- సీసాలో పేస్ట్ నింపాక, పైభాగంలో అర టీస్పూన్ నూనెను సమంగా పోయాలి. ఇది పేస్ట్‌కు గాలి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
- పేస్ట్‌ను ఉపయోగించే ప్రతిసారీ పూర్తిగా పొడిగా ఉన్న చెంచానే వాడాలి. ఒక్క చుక్క తడి తగిలినా పేస్ట్ మొత్తం క్షణాల్లో పాడవుతుంది.
డీప్ ఫ్రీజర్ ఐడియా
మీరు ఈ పేస్ట్‌ను 5-6 నెలల పాటు భద్రపరుచుకోవాలనుకుంటే… తయారైన పేస్ట్‌ను ఐస్ క్యూబ్ ట్రేలో వేసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి. గడ్డకట్టిన తర్వాత ఆ క్యూబ్స్‌ను తీసి ఒక జిప్‌లాక్ కవర్‌లో వేసి ఫ్రీజర్‌లోనే ఉంచండి. వంట చేసే సమయంలో కూరకు అవసరమైనన్ని క్యూబ్స్ నేరుగా తీసి వేడి బాణలిలో వేసుకుంటే సరిపోతుంది. సమయం ఆదాతో పాటు వంట కూడా నిమిషాల్లో పూర్తవుతుంది.
