
మన తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్డు కూరను సాధరణంగా ఫ్రై లేదా ఉడకబెట్టి కూరలా చేసుకుంటారు. లేదా కోడి గుడ్లతో పులుసు పెట్టుకొని రైస్‌లోకి తింటారు. అయితే చెట్టినాడు స్టైల్‌లో కోడిగుడ్డు మసాలా గ్రేవీని మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఇప్పుడు అది తినేందుకు మనం తమిళనాడు దాకా వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే చెట్టినాడు స్టైల్‌లో కోడిగుడ్డు మసాలా గ్రేవిని సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికి ఏం ఏం కావాలి, దాన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
కోడి గుడ్డు మసాలా గ్రేవీకి కావల్సిన పదార్థాలు
ఈ పులుసు అసలు రుచి మనం రుబ్బి వేసే మసాలాలోనే ఉంది. కాబట్టి ముందుగా ఒక పెద్ద టొమాటో ,10 చిన్న ఉల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పులుసు తాలింపు కోసం నువ్వుల నూనె, కొద్దిగా ఆముదం ఉపయోగించడం వల్ల అసలైన చెట్టినాడ్ రుచి వస్తుంది. పులుసులోకి సరిపడా పసుపు, కారం, ధనియాల పొడి సిద్ధం చేసుకోవాలి. అర కప్పు కొబ్బరి తురుమును మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
రుచికరమైన పులుసు తయారీ విధానం
ఇప్పుడు స్టవ్‌పై ఒక బాండీ పెట్టి దానిలో నూనె పోసి వేడయ్యాక, మెంతులు వేసి చిటపటలాడించాలి. తర్వాత వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. దీనికి ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో-ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత తగినంత నీరు, చింతపండు రసం, మసాలా పొడులు వేసి, ఉప్పు చూసుకుని బాగా మరిగించాలి. పులుసు చిక్కబడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
మీరు పులుసు సిద్ధమవుతున్నప్పుడే పనియారమ్ తయారీ మొదలుపెట్టవచ్చు. ఒక బాండీలో ఉల్లిపాయలు వేయించి, అందులో పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి వేయించి చల్లారనివ్వాలి. ఒక పాత్రలో మూడు కోడిగుడ్లను కొట్టి పోసి, వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొంగనాల పెనంపై నూనె రాసి, ఈ గుడ్డు మిశ్రమాన్ని పోసి రెండు వైపులా ఎర్రగా కాల్చి ఓ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి.
ఇక చివరగా మనం ముందుగానే సిద్ధం చేసుకున్న పులుసును మళ్లీ పొయ్యి మీద పెట్టి, రుబ్బిన కొబ్బరి పేస్ట్ వేసి కలపాలి. పులుసు ఒక ఉడుకు రాగానే, మనం కాల్చి పెట్టుకున్న కోడిగుడ్డు పునుగులను నెమ్మదిగా పులుసులో వేయాలి. పునుగులు పులుసును పీల్చుకునే వరకు మంటను తక్కువలో ఉంచి ఒక నిమిషం పాటు ఉంచి దించాలి. అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మసాలా గ్రేవీ రెడీ అయినట్టే.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.