
వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట నుంచి ఇళ్లలోకి వస్తాయి. వర్షం నుంచి తప్పించుకోవడానికి వెచ్చదనం కోసం.. ముఖ్యంగా ఆహారం కోసం ఇవి లోపలికి చేరుతాయి. కొన్ని వస్తువులు, అలవాట్లు పాములను పరోక్షంగా ఆకర్షిస్తాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ధాన్యాలు ఎలుకలకు ఫేవరెట్ ఫుడ్. వంటింట్లో వీటిని తెరిచి ఉంచితే ఎలుకలు వస్తాయి. ఈ ఎలుకలను వేటాడటానికి పాములు కూడా ఆ ఏరియాలోకి వస్తాయి. పాములు ఇళ్లలోకి రావడానికి ఇది ఒక ముఖ్య కారణం.
కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కువసేపు వంటింట్లో ఉంచితే.. వాటి వాసనకు చిన్న చిన్న జంతువులు, ఎలుకలు ఆకర్షితమవుతాయి. వాటిని పట్టుకోవడానికి పాములు కూడా ఆ ప్రాంతానికి వస్తాయి.
గుడ్లు, పాలు, పెరుగు లాంటి పదార్థాలను తెరిచి ఉంచినా లేదా వాటి వాసన బయటికి వచ్చినా ఎలుకలు వస్తాయి. ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయంటే.. వాటిని వేటాడే పాములు కూడా వాటి వెంట ఇంటికి చేరుతాయి.
పిల్లులు, కుక్కలు లేదా పక్షుల కోసం ఉంచే ఆహారం బయట తెరిచి ఉంచకూడదు. ఈ ఆహారం ఇతర చిన్న జీవులను ఆకర్షిస్తుంది. వాటి వెంట పాములు కూడా ఇంటికి రావచ్చు.
పాములు వర్షాకాలంలో ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు, వ్యర్థాలను సరిగ్గా నిల్వ చేయడం వల్ల ఎలుకలు, ఇతర చిన్న జీవులు రాకుండా ఉంటాయి. దీంతో పాములు వాటిని వెతుక్కుంటూ ఇంట్లోకి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు పాముల నుంచి రక్షణ కల్పిస్తాయి.