
వేసవి కాలం రాగానే మామిడి పండ్ల వాసన, రుచి మనల్ని ఆహ్లాదపరుస్తాయి. అయితే మార్కెట్లలో చూసినప్పుడు అందంగా కనిపించే కొన్ని మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరమైనవి కావచ్చు. వాటిని సహజంగా కాకుండా రసాయనాల సహాయంతో త్వరగా పండిస్తారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి మామిడిని వేగంగా పండించడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి మామిడి పండ్లను తినకుండా ఉండాలంటే ముందుగా వాటిని గుర్తించడం అవసరం.
సహజంగా పండిన మామిడి తీపి వాసనను విరజిమ్ముతుంది. పండు కాడ దగ్గర ముక్కు పెట్టి వాసన చూస్తే సహజమైన తీయదనం గమనించవచ్చు. కానీ కెమికల్స్‌తో పండించిన పండ్లలో వాసన చాలా తక్కువగా ఉండటం లేదా అసహజమైన వాసన రావడం గమనించవచ్చు.
రసాయనాలతో పండించిన మామిడి చాలా ముదురు పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. సహజంగా పండిన మామిడిలో కొంత పచ్చదనం ఉంటుంది. పైగా సహజంగా పండిన పండ్లపై చిన్న చిన్న మచ్చలు ఉండే అవకాశం ఉంటుంది కానీ కెమికల్స్ వాడిన వాటిలో అవి కనిపించవు.
పండు ఒక భాగం బాగా పండిపోయి మిగిలిన భాగం పచ్చిగా ఉంటే అది రసాయనాల వల్ల పండించబడిందని భావించవచ్చు. సహజంగా పండిన మామిడి సమానంగా పండుతుంది.
చూడటానికి బాగానే ఉన్నా చేతితో ముట్టుకుంటే పండు మితిమీరిన మెత్తదనంతో ఉంటుంది. ఇది సహజమైన లక్షణం కాదు. కెమికల్స్ వాడిన మామిడిలో ఇది సాధారణంగా కనిపిస్తుంది.
పండిన మామిడి తొక్కపై ముడతలు పడితే అది పూర్తిగా పండకముందే కెమికల్స్ వల్ల బలవంతంగా పండించబడినదని అర్థం. పోషకాలు నెమ్మదిగా అందకుండా ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది.
పండు పైభాగంలో తెల్లటి లేదా బూడిద రంగులో ఉన్న పొడి కనిపిస్తే అది కాల్షియం కార్బైడ్ అణువుల అవశేషంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.
బయటివేళ్లు మామిడి బాగా పండినట్లు కనిపించినా లోపల గుజ్జు బ్రౌన్ రంగులో ఉండడం లేదా పూర్తిగా ముద్దగా ఉండడం కెమికల్స్ వాడటం వల్ల కలిగే ప్రభావం.
ఈ రకమైన మామిడి పండ్లు తినడం వల్ల నోరు మండిపోవడం, గొంతు మంట, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలంగా తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో మామిడిని కొనేటప్పుడు దాని వాసన, రంగు, గట్టితనం, పైన ఉన్న పొడి వంటి అంశాలను బట్టి జాగ్రత్తగా పరిశీలించాలి.