కేవలం 5 నిమిషాలు చాలు.. మీ ఆయుష్షు ఏడాది పెరుగుతుంది.. ఈ చిన్న మార్పులతో..
మీ ఆయుష్షును పెంచుకోవడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాలి లేదా కఠినమైన డైటింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.. మనం చేసే అతి చిన్న పనులు కూడా మన ప్రాణాలను కాపాడగలవని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఒక విప్లవాత్మక నిజం వెల్లడించింది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం దీర్ఘకాలం జీవించాలంటే గంటల తరబడి జిమ్ చేయాలని లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించాలని అనుకుంటాం. కానీ అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనం ఒక షాకింగ్, సంతోషకరమైన వార్తను అందించింది. మన దైనందిన జీవితంలో చేసే అతి చిన్న మార్పులు కూడా మన ఆయుష్షును ఏకంగా ఒక సంవత్సరం పెంచుతాయని ఈ పరిశోధన తేల్చింది.
ఏడాది ఆయుష్షు పెరగాలంటే ఏం చేయాలి?
దాదాపు 60,000 మందిపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన అధ్యయనం ప్రకారం.. ఏదో ఒక చిన్న మార్పు చేసినా మీరు అదనంగా ఒక సంవత్సరం జీవించవచ్చు.
కేవలం 5 నిమిషాల అదనపు నిద్ర: నిద్ర తక్కువగా ఉన్నవారు రోజుకు మరో 5 నిమిషాలు నిద్రను పెంచితే మంచి ఫలితం ఉంటుంది.
2 నిమిషాల వ్యాయామం: వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా మితమైన వ్యాయామం కేవలం రెండు నిమిషాలు చేసినా సరిపోతుంది.
అదనపు కూరగాయలు: రోజువారీ ఆహారంలో సగం కప్పు కూరగాయలను అదనంగా చేర్చుకోవడం.
9 ఏళ్ల అదనపు జీవితం సాధ్యమేనా?
అవును.. నిద్ర, ఆహారం, శారీరక శ్రమ మూడింటిని క్రమబద్ధీకరించుకుంటే ఏకంగా తొమ్మిది ఏళ్ల పైగా అదనపు జీవితకాలాన్ని పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
- రోజుకు 7-8 గంటల నిద్ర.
- 40 నిమిషాల చురుకైన వ్యాయామం.
- సరైన పోషకాహారం.
ఈ మూడు అలవాట్లు కలిస్తే వచ్చే ఫలితం, విడివిడిగా పాటించే అలవాట్ల కంటే ఐదు రెట్లు శక్తివంతమైనదని నిపుణులు స్పష్టం చేశారు.
నడకతో మరణ గండం నుంచి గట్టెక్కవచ్చు
నార్వే, స్పెయిన్, ఆస్ట్రేలియా పరిశోధకులు 1,35,000 మంది పెద్దల డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం..
5 నిమిషాల నడక: రోజువారీ దినచర్యలో కేవలం 5 నిమిషాల అదనపు నడకను జోడిస్తే మరణ ప్రమాదాన్ని 10 శాతం తగ్గించవచ్చు.
కదలకుండా కూర్చోవద్దు: రోజుకు 10 గంటల కంటే ఎక్కువ సమయం నిశ్చలంగా ఉండేవారు.. ఆ సమయాన్ని రోజుకు కేవలం 30 నిమిషాలు తగ్గించుకుంటే మరణాల రేటులో 7 శాతం తగ్గుదల కనిపిస్తుంది.
నిపుణుల హెచ్చరిక
“మనం శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే, అంత ఆరోగ్యంగా ఉంటామనే దానికి ఈ పరిశోధన ఒక బలమైన సాక్ష్యం” అని ప్రొఫెసర్ ఉల్ఫ్ ఎకెలుండ్ తెలిపారు. అయితే ఇది జనాభా మొత్తం మీద చేసిన అంచనా అని ప్రతి వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి మార్పులు ఉండవచ్చని పరిశోధకులు సూచించారు.
లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, కాసేపు ముందుగా నిద్రపోవడం వంటి చిన్న చిన్న మార్పులే ఆయుష్షును పెంచనున్నాయి. కాబట్టి ఇప్పుడే ఆ చిన్న అడుగు వేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
