AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజమైన వీరుడు ఎవరో తెలుసా? నెల్సన్ మండేలా లైఫ్ ఛేంజింగ్ మోటివేషన్ కోట్స్

Nelson Mandela inspirational quotes: నెల్సన్ మండేలా (1918–2013) దక్షిణాఫ్రికా దేశపు తొలి నల్లజాతి అధ్యక్షుడు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా న్యాయం, సమానత్వం, క్షమాశీలతకు ప్రతీక. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ 27 సంవత్సరాలు జైలులో గడిపినా.. ఆయన మనసులో ద్వేషానికి చోటు ఇవ్వలేదు. ఆయన మాటలు నేటికీ కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక మాటలను ఇప్పుడు చూద్దాం.

నిజమైన వీరుడు ఎవరో తెలుసా? నెల్సన్ మండేలా లైఫ్ ఛేంజింగ్ మోటివేషన్ కోట్స్
Nelson Mandela
Rajashekher G
|

Updated on: Jan 15, 2026 | 10:42 AM

Share

నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (Nelson Rolihlahla Mandela).. వర్ణ విక్షకు వ్యతిరేకంగా, నల్ల జాతీయుల హక్కుల కోరాడిన మహానీయుడు. అందరికీ సమాన హక్కులు ఉండాలని అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. దక్షిణాఫ్రికాలో ఆయన మొదలుపెట్టిన వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

నెల్సన్ మండేలా (1918–2013) దక్షిణాఫ్రికా దేశపు తొలి నల్లజాతి అధ్యక్షుడు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా న్యాయం, సమానత్వం, క్షమాశీలతకు ప్రతీక. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ 27 సంవత్సరాలు జైలులో గడిపినా.. ఆయన మనసులో ద్వేషానికి చోటు ఇవ్వలేదు. ఆయన మాటలు నేటికీ కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆయన చెప్పిన కొన్ని మంచి మాటలను ఇప్పుడు చూద్దాం.

స్వేచ్ఛపై సూక్తులు

“స్వేచ్ఛ అనేది కేవలం బంధనాల నుంచి విముక్తి కాదు; ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తూ జీవించడమే నిజమైన స్వేచ్ఛ.” అని స్పష్టం చేశారు. ఈ సూక్తి మనకు స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, సమాజంతో బాధ్యతతో జీవించడమే నిజమైన స్వేచ్ఛ అని చెబుతుంది.

“ఒక మనిషిని అతను అర్థం చేసుకునే భాషలో మాట్లాడితే అది అతని మేధస్సుకు చేరుతుంది; అతని మాతృభాషలో మాట్లాడితే అది అతని హృదయానికి చేరుతుంది.” అని మండేలా చెప్పారు. నాయకత్వంలో అనురాగం, అవగాహన ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.

ధైర్యం, భయంపై సూక్తులు

“ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు; భయాన్ని జయించడమే ధైర్యం.” ప్రతి మనిషికి భయం సహజమే. కానీ భయాన్ని అధిగమించి ముందుకు సాగేవాడే నిజమైన వీరుడు.

“నేను ఎప్పుడూ ఓడిపోలేదు; గెలిచాను లేదా నేర్చుకున్నాను.” ఓటమిని కూడా ఒక పాఠంగా చూసే దృక్పథమే జీవితంలో ఎదగడానికి మార్గం అని మండేలా స్పష్టం చేశారు.

విద్య, జ్ఞానంపై సూక్తులు

“ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య.” విద్య ద్వారా వ్యక్తి మాత్రమే కాదు, సమాజం కూడా మారుతుందని మండేలా నమ్మకం.

“జ్ఞానం ఉన్నచోటే నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది.” అజ్ఞానం బానిసత్వానికి దారి తీస్తే, జ్ఞానం విముక్తికి మార్గం వేస్తుంది.

క్షమాశీలత, మానవత్వం

“క్షమించకపోవడం అంటే విషం తాగి, ఎదుటివాడు చనిపోతాడని ఆశించడమే.” ద్వేషం మనకే హాని చేస్తుందని, క్షమించడమే మనసుకు శాంతిని ఇస్తుందని ఈ మాట చెబుతుంది.

“మనిషి గొప్పతనం అతను పడిపోకపోవడంలో కాదు; పడిపోయిన ప్రతిసారి లేచే శక్తిలో ఉంటుంది.” అని మండేలా చెప్పేవారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలే మనను గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి.

నాయకత్వంపై మండేలా స్ఫూర్తిదాయక మాటలు

“నాయకుడు ముందుండి నడిపిస్తాడు, కానీ వెనుక నుంచే ప్రజలను ముందుకు నడిపిస్తాడు.” నిజమైన నాయకత్వం అహంకారం కాదు, సేవాభావం.

“మీ వెలుగు ఇతరులను భయపెట్టకుండా ప్రకాశించనివ్వండి.” మన ప్రతిభను దాచకుండా, ఇతరులకూ ప్రేరణగా నిలవాలని ఈ సూక్తి చెబుతుంది.

నెల్సన్ మండేలా సూక్తులు కేవలం మాటలు కావు.. అవి జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు. స్వేచ్ఛ, సమానత్వం, ధైర్యం, క్షమాశీలత వంటి విలువలు నేటి సమాజానికి ఎంత అవసరమో ఆయన మాటలు మనకు గుర్తుచేస్తాయి. మన జీవితాల్లో చిన్న మార్పులు చేసి, మండేలా చూపిన మార్గంలో నడిస్తే.. మనం కూడా సమాజానికి వెలుగునిచ్చే దీపాలుగా మారగలం.