హోటల్ నుండి చెక్-అవుట్ చేస్తున్నారా? ఈ వస్తువులను మీతో తీసుకెళ్లవచ్చు.. ఎవరూ మిమ్మల్ని ఆపరు!
మీరు వారాంతపు సెలవులు, సమ్మర్ హాలీడేష్ కోసం విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే పిల్లలు, పెద్దలతో కలిసి సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే, మీరు హోటల్‌లో బస చేసిన తరువాత చెక్అవుట్ చేసేటప్పుడు మీ బ్యాగ్‌లో ఏమేం ప్యాక్ చేసుకోవచ్చో, ఏ వస్తువులను ముట్టుకోకూడదో తెలుసుకోవడం తప్పనిసరి. లేదంటే, తెలిసి తెలియక అక్కడి ఏదైన నచ్చిన వస్తువు వెంటనే తెచ్చుకున్నారంటే..మీరు చింతించాల్సి వస్తుంది. అందుకే హోటల్ చెక్ అవుట్ నియమాలేంటో తప్పక తెలుసుకోవాల్సి ఉంది.

మనలో చాలా మంది వారాంతాల్లో ప్రయాణించడం ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. మనం ఒక మంచి ప్రదేశంలో విహారయాత్రకు వెళ్ళినప్పుడు, అక్కడి విలాసవంతమైన హోటళ్ళ వైభవం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. హోటల్ గదులలో ఉండే చిన్న షాంపూ సీసాలు లేదా అందమైన సబ్బుల వంటి చిన్న చిన్న వస్తువులు మనల్ని ఆకర్షిస్తాయి. మనం హోటల్ నుండి బయలుదేరినప్పుడు ఇంటికి ఏమి తీసుకురావచ్చో, ఏ వస్తువులు ఖరీదైనవిగా ఉంటాయో అని ప్రజలు తరచుగా ఆశ్చర్యపోతుంటారు. ఇటీవల, బాలిలోని ఉబుద్ నుండి ఒక వార్త వెలువడింది. అక్కడ భారతీయ పర్యాటకులు తెలియకుండా కొన్ని వస్తువులను తమతో తీసుకువెళ్ళినందుకు ఇబ్బంది పడ్డారు. కాబట్టి, మీరు హోటల్ నుండి బయలుదేరేటప్పుడు మీతో ఏం తీసుకురావచ్చో, ఏం తీసుకురాలేరో తెలుసుకుందాం.
హోటల్ గదిలో అడుగుపెట్టగానే అక్కడ అమర్చి ఉన్న వస్తువులను చూసి, వీటిలో వేటిని మనం వాడవచ్చు లేదా వెంట తీసుకెళ్లవచ్చు అనే ఆలోచన రావడం సహజం. చాలా సార్లు తెలియక కొన్ని వస్తువులను తీసుకెళ్లడం వల్ల హోటల్ యాజమాన్యం మీ బిల్లుకు అదనపు ఛార్జీలు జోడించే అవకాశం ఉంది. అందుకే ఈ క్రింది విషయాలను తప్పక తెలుసుకోండి.
మీరు తీసుకెళ్లదగిన వస్తువులు (Freebies):
హోటళ్లు వీటిని ‘కాంప్లిమెంటరీ’గా పరిగణిస్తాయి, అంటే మీరు వీటి కోసం ఇప్పటికే చెల్లించారు. అలాంటి వాటిల్లో
టాయిలెట్రీస్: చిన్న బాటిల్స్‌లో ఉండే షాంపూ, కండిషనర్, బాడీ వాష్, లోషన్, సోప్స్.
డిస్పోజబుల్ వస్తువులు: డెంటల్ కిట్ (టూత్ బ్రష్, పేస్ట్), షేవింగ్ కిట్, కోంబ్ (దువ్వెన), షవర్ క్యాప్.
టీ/కాఫీ సామాగ్రి: గదిలో ఉండే టీ బ్యాగులు, కాఫీ సాచెట్లు, చక్కెర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ (ఒకవేళ ఫ్రీ అని రాసి ఉంటే).
స్లిప్పర్లు: హోటల్ అందించే వన్-టైమ్ యూజ్ (డిస్పోజబుల్) స్లిప్పర్లను మీరు వెంట తీసుకువెళ్లవచ్చు.
ముట్టుకోకూడని వస్తువులు (Hotel Property):
ఈ వస్తువులను తీసుకుంటే అది దొంగతనంగా పరిగణించబడుతుంది. లేదా మీ క్రెడిట్ కార్డ్ నుండి డబ్బులు కట్ చేయబడతాయి. అందులో బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, బ్లాంకెట్లు, ముఖ్యంగా టవల్స్. హెయిర్ డ్రయ్యర్, ఐరన్ బాక్స్, అలారం క్లాక్ లేదా టీవీ రిమోట్. గ్లాసులు, కప్పులు, స్పూన్లు లేదా గదిలో ఉండే ప్లేట్లు. అల్మారాలో ఉంచిన హ్యాంగర్లను లేదా గది అందాన్ని పెంచడానికి ఉంచిన పెయింటింగ్, అలంకరణ వస్తువులను తీసుకోవటం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. కొన్ని లగ్జరీ హోటళ్లు బాత్‌రోబ్స్‌ను అందిస్తాయి. కానీ, ఇవి కేవలం వాడటానికి మాత్రమే. వీటిని తీసుకువెళ్లాలనుకుంటే మీరు భారీ ధర చెల్లించాల్సి ఉంటుంది.
చెక్-అవుట్ చేసే ముందు మీకు ఏదైనా వస్తువుపై సందేహం ఉంటే, రిసెప్షన్ వద్ద అడగడం ఉత్తమం. సాధారణంగా యూజ్ అండ్ త్రో రకానికి చెందిన వస్తువులను మాత్రమే మీరు మీ బ్యాగులో సర్దుకోవచ్చు. లేదంటే, హోటల్‌లో మీకు ఏదైనా మగ్ లేదా బాత్‌రోబ్ నిజంగా నచ్చితే, దాన్ని దొంగచాటుగా లోపలికి తీసుకువెళ్లే బదులు, రిసెప్షన్‌లో అడగండి. చాలా హోటళ్లలో గిఫ్ట్ షాప్ విభాగం ఉంటుంది. అక్కడ మీరు కొత్త వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇది మీ ప్రతిష్టను కాపాడటమే కాకుండా, మీ యాత్ర జ్ఞాపకాలు చెడిపోకుండా కూడా నివారిస్తుంది.




