
ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా చాలామది ఊబకాయం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. అయితే.. ఉదయాన్నే పరగడుపున వేడి నీటిలో తేనె కలిపి తాగితే చాలా మంచిది.. ఇలా డైలీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అంతేకాకుండా ఇంకా ఎన్నో అపొహలు కూడా ఉన్నాయి.,. అయితే, బరువు తగ్గడం, పెరగడం వంటి అంశాలపై అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. సన్నగా ఉన్నవారు తేనె నీళ్ళు తాగితే మరింత సన్నగా అవుతారా, లేదా లావుగా ఉన్నవారు తగ్గుతారా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం..
సహజంగా, 100 గ్రాముల తేనెలో 317 క్యాలరీల శక్తి ఉంటుంది. అదే 100 గ్రాముల పంచదారలో సుమారు 400 క్యాలరీలుంటాయి. పంచదార కంటే తేనె తక్కువ మోతాదులో వాడినా ఎక్కువ తీపినిస్తుంది. దీనికి కారణం తేనెలోని ప్రత్యేకమైన రసాయన సంయోజనం.. సహజమైన తీపి గుణం. తేనెలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఈ గుణాల వల్ల తేనె ఎవ్వరికైనా ఆరోగ్యానికి మంచిదే. అది సన్నగా ఉన్నవారైనా, లావుగా ఉన్నవారైనా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సహజమైన ప్రత్యామ్నాయంగా పంచదారకు బదులుగా తేనెను వాడటం మంచిది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఉదయం పూట పరగడుపున వేడి నీటిలో నాలుగు స్పూన్ల తేనె కలిపి తాగడం గురించి చాలా మందిలో సందేహాలున్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నాలుగు స్పూన్ల తేనె కలిపితే సుమారు 115 నుంచి 120 క్యాలరీల శక్తి లభిస్తుంది. తేనెను కలపడం వల్ల శరీరానికి అదనంగా శక్తి అందుతుంది. కాబట్టి సన్నగా ఉన్నవారు తేనె నీరు తాగితే మరింత సన్నబడతారు అనే భయం అనవసరం. బరువు తగ్గాలనుకునేవారు కూడా తేనె నీరు తాగడం ద్వారా అదనపు క్యాలరీలను పొందుతున్నారనేది గుర్తుంచుకోవాలి. దీని వల్ల బరువు కూడా కొంట్రోల్ అవుతుంది.
కొవ్వును కరిగించడానికి వేడి నీటిని తాగాలనే నమ్మకం ఒక పెద్ద అపోహ. వేడి నీరు తాగిన వెంటనే శరీరం లోపలికి వెళ్ళగానే దాని ఉష్ణోగ్రతను 36 డిగ్రీలకు సర్దుబాటు చేస్తుంది. చల్లటి నీరు తాగినా, వేడి నీరు తాగినా శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటుంది. కాబట్టి వేడి నీళ్ళు నేరుగా వెళ్లి కొవ్వు కణాలను కరిగించే అవకాశం లేదు.
తేనెకు కొవ్వును కరిగించే గుణం ఉందని చాలా మంది అనుకుంటారు, ఇది పూర్తిగా తప్పు. తేనెలో కొవ్వును కరిగించే గుణం ఏ మాత్రం లేదు. మరి ఉపవాసాలు చేసేటప్పుడు తేనె నీళ్ళు తాగితే బరువు తగ్గుతున్నారు కదా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ తేనె బరువును తగ్గించదు. మనం సాధారణంగా రోజుకు స్త్రీలు 1800-2000 క్యాలరీలు, పురుషులు 2400-2500 క్యాలరీల ఆహారం తీసుకుంటారు. ఉపవాసం చేసేటప్పుడు, తేనె నీళ్ళు (ఒక్కోసారి 120 క్యాలరీలు) ఐదు సార్లు తాగినా సుమారు 600-700 క్యాలరీల శక్తి మాత్రమే శరీరానికి అందుతుంది. శరీరానికి అవసరమైన మిగిలిన 1300-1400 క్యాలరీలను అది నిల్వ ఉన్న కొవ్వు నుండి కరిగించి వాడుకుంటుంది. కాబట్టి బరువు తగ్గడం అనేది తేనె వల్ల కాదు, కేవలం క్యాలరీల లోటు వల్ల శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వు కరగడం వల్లే జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసంలో తేనె నీరు తాగడం వల్ల జీర్ణకోశానికి విశ్రాంతి లభిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్స్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల శరీరం తనను తాను శుభ్రపరచుకోవడానికి, మరమ్మత్తు చేసుకోవడానికి ఎక్కువ శక్తిని కేటాయించగలుగుతుంది. అదేవిధంగా, చక్కెర రసం, బత్తాయి రసం లేదా కొబ్బరి నీళ్ళు వంటి 700 క్యాలరీలు ఇచ్చే ఇతర ద్రవాలు తాగినప్పుడు కూడా ఇదేవిధంగా బరువు తగ్గుతారు. కానీ, జీర్ణకోశానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఉపవాసంలో తేనె నీరు తాగడం వల్ల శరీరం లోపల శుభ్రపరచుకునే ప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది.
తేనెను చన్నీళ్ళల్లో తాగినా, వేడి నీళ్ళల్లో తాగినా దాని బరువును పెంచే, తగ్గించే గుణం మారదు. ఈ రెండిటికీ సంబంధం లేదు. తేనె అనేది ఒక ఆరోగ్యకరమైన పోషక పదార్థం, ఇది శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. సన్నగా ఉన్నవారు కూడా తేనె వాడటం వల్ల మరీ సన్నగా అవుతారనే భయం లేకుండా దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట తేనె నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ, బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ఒక అద్భుత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..