High Salt Problems: ఉప్పు ముప్పే.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. అనుమానించాాల్సిందే..

|

Feb 28, 2023 | 1:30 PM

ఉప్పు ఆహారానికి ఎంత రుచి తీసుకువచ్చినా ఆరోగ్యానికి మాత్రం అంతేస్థాయిలో ముప్పు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఉప్పు వినియోగం విషయంలో ఎక్కువగా పెద్దలపై శ్రద్ధ పెడతాం. చిన్నపిల్లలు ఎలా తిన్నా పర్లేదు అని అనుకుంటాం. కానీ అది తప్పని చిన్న పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు.

High Salt Problems: ఉప్పు ముప్పే.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. అనుమానించాాల్సిందే..
Salt
Follow us on

అధిక ఉప్పు వినియోగం ఎప్పటికీ ముప్పేనని వైద్యులు చెబుతూ ఉంటారు. ఉప్పు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  ఉప్పు ఆహారానికి ఎంత రుచి తీసుకువచ్చినా ఆరోగ్యానికి మాత్రం అంతేస్థాయిలో ముప్పు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఉప్పు వినియోగం విషయంలో ఎక్కువగా పెద్దలపై శ్రద్ధ పెడతాం. చిన్నపిల్లలు ఎలా తిన్నా పర్లేదు అని అనుకుంటాం. కానీ అది తప్పని చిన్న పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఉప్పు వినియోగం ఏ వయస్సు వారికైనా చేటు చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా పిల్లల్లో కొన్ని లక్షణాలు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

అధిక దాహం

ఉప్పులో ఉండే సోడియం వల్ల అధికంగా దాహం వేస్తుంది. ఎందుకంటే సోడియం నీటితో సమతుల్యతను కోరుకుంటుంది. అందువల్ల అధికంగా ఉప్పు తీసుకుంటే దాహం పెరుగుతుంది. మంచినీరు అధికంగా తాగడం పిల్లల ఆరోగ్యానికి మంచిదే అయినా అధికంగా దాహంతో ఉంటే అనుమానించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ముదురు, పసుపు రంగు మూత్రం

మీ చిన్నారికి అధికంగా దాహం వేయడంతో పాటు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తే వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా వారి మూత్రం రంగును పరిశీలించాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే మూత్రం ముదురు లేదా పసుపు రంగులో వస్తుంటే వెంటనే ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. అలాగే వాసనతో కూడిన మూత్రం వస్తే శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని గమనించాలి. ఇలాంటి సమయంలో వెంటనే చిన్నారులకు మూత్ర పరీక్ష చేయించి, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

చేతులు, కాళ్ల వాపు

మీ చిన్నారులు అధికంగా ఉప్పు వినియోగిస్తే దానిలోని సోడియం అదనంగా నిల్వ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇది శరీరంలోని కణాల వెలుపల ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. ఇలా జరిగితే చేతులు, కాళ్లు వంటి ప్రదేశాల్లో వాపు లేదా ఉబ్బరాన్ని గమనించవచ్చు. 

అధిక రక్తపోటు ప్రమాదం

ఉప్పు అధికంగా వినియోగిస్తే రక్తపోటు ప్రమాదం పొంచి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రమాదం చిన్నపిల్లలకు కూడా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఓ అధ్యయనం ప్రకారం 3-18 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో 7 శాతం మంది హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు అధికంగా ఉంటే గుండె జబ్బులతో పాటు గుండె పోటు ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

ఉప్పు తీసుకోవాల్సిందిలా..

యూకేలోని ఓ ప్రసిద్ధ సంస్థ నివేదికలో పిల్లలు ఓ రోజులో ఎంత ఉప్పు తినాలో తెలిపారు. 1-3 సంవత్సరాలు ఉన్నవారు రోజు రెండుగ్రాముల, 4-6 సంవత్సరాలు ఉన్నవారు మూడు గ్రాములు, 7-10 సంవత్సరాలు ఉన్నవారు ఐదు గ్రాములు, 11 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. అలాగే ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు ఓ గ్రాము కంటే తక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవాలి. 

అధిక సోడియం నుంచి రక్షణ ఇలా

ముఖ్యంగా చిన్నారులు సోడియం తినడాన్ని పరిమితం చేయాలి. శరీరరంలో సోడియం నిల్వలను సమతుల్యం చేసే ఆహారంతో పాటు పండ్లను ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి. అలాగే సోడియం స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎక్కువ నీరు తాగేలా చూసుకోవాలి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిల నిర్వహణ సాయం చేసే సమర్థవంతమైన ఖనిజం. కాబట్టి పొటాషియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేలా చూడాలి. అరటి పండ్ల ద్వారా పొటాషియం ఎక్కువ అందుతుంది కాబట్టి వాటిని తినేలా చూసుకోవాలి. ఆకు కూరలు, బ్రోకొలీ, పెరుగు, కివి వంటి ఆహారం చిన్నారులు తినేలా చూసుకుంటే అధిక సోడియం ప్రమాదం నుంచి బయటపడవచ్చు. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి