కిచెన్ లోని ఈ వస్తువులు ఎంత ప్రమాదమో తెలుసా..? వెంటనే జాగ్రత్తపడండి.. నిపుణులు హెచ్చరిస్తున్నారు..!

మీ ఇంటి వంటగదిలో మీరు ప్రతిరోజూ వాడే కొన్ని వస్తువులు మామూలుగా ప్రమాదకరం కాదని అనిపించినప్పటికీ.. అవి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వస్తువుల వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి సమస్యలు రావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ హానికరమైన వంటగది వస్తువులు.. వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిచెన్ లోని ఈ వస్తువులు ఎంత ప్రమాదమో తెలుసా..? వెంటనే జాగ్రత్తపడండి.. నిపుణులు హెచ్చరిస్తున్నారు..!
Kitchen

Updated on: Jun 30, 2025 | 11:29 AM

నాన్ స్టిక్ ప్యాన్‌ లలో ఉండే పదార్థాలు ఎక్కువ వేడికి గురైనప్పుడు విషపూరిత వాయువులను విడుదల చేస్తాయి. ఈ ప్యాన్‌ లపై పగుళ్లు ఏర్పడినా లేదా గీతలు పడినా అవి ఆహారంలోకి రసాయనాలను కలుపుతాయి. ఈ రసాయనాలలో పీఎఫ్‌ వోఏ (PFOA), పీఎఫ్‌ ఏఎస్‌ (PFAS) వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ దెబ్బతినడం, రోగనిరోధక శక్తిలో లోపాలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల పాత నాన్ స్టిక్ ప్యాన్‌ లను వాడటం మానుకోవడం మంచిది.

వంటపాత్రలను మూయడానికి లేదా ఆహారం చుట్టడానికి వాడే అల్యూమినియం ఫాయిల్ ఎక్కువ వేడికి గురైనప్పుడు ఆహారంలోకి లోహం చేరే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం అల్యూమినియం వండిన ఆహారం తినడం వల్ల నాడీ సంబంధ వ్యాధులు, అల్జీమర్స్ వంటి మెదడు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అల్యూమినియం ఫాయిల్‌ ను ఎక్కువ వేడికి ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం.

ప్లాస్టిక్ డబ్బాలు, బాక్సులు, ప్లేట్లు వంటివి మనం తరచుగా ఉపయోగిస్తాం. అయితే పాత, తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ పాత్రల నుండి బిస్ఫెనాల్ A (BPA), BPS, ఫ్తాలేట్స్ వంటి విష రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మైక్రోవేవ్‌ లో వేడిచేసేటప్పుడు లేదా నూనె పదార్థాలు, పులుపు ఉన్న ఆహారాలతో కలిపి ఉపయోగిస్తే ఈ విష రసాయనాల విడుదల ఎక్కువవుతుంది. ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి సంతానోత్పత్తి శక్తిని తగ్గించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.

ప్లాస్టిక్ కత్తులు, స్పూన్లు, గరిటెలు వంటివి వాడేటప్పుడు వేడి తగిలినప్పుడు వీటి నుంచి మైక్రోప్లాస్టిక్స్, ఇతర విష రసాయనాలు విడుదలవుతాయి. ఈ విష రసాయనాలు ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి వాపులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల ప్లాస్టిక్ వంట సామగ్రిని వేడిచేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.

గ్యాస్ స్టవ్‌ లు వాడేటప్పుడు బెంజీన్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయు కాలుష్యాలు బయటకు వస్తాయి. ఈ వాయువులు ఇంట్లో గాలి సరిగా వెలుపలికి పోకుండా ఉంటే.. ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా చిన్న ఇళ్లు, సరైన గాలి మార్పిడి లేని ప్రదేశాల్లో ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటివి వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పాత వస్తువులను తరచుగా మార్చడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, గ్యాస్ స్టవ్‌ లు వాడినప్పుడు గాలి బాగా వెళ్ళేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.