Health Benefits of Eating Eggs: సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన పోషకాహారాల్లో గుడ్డు ఒకటి. వీటిల్లో శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే పోషకాహార నిపుణునలు క్రమం తప్పకుండా రోజుకో గుడ్డు తినమని సూచిస్తుంటారు. నిజానికి, గుడ్లలో13 రకాల విటమిన్లు, ఖనిజాలను ఉంటాయి. జీవసంబంధ విలువ కలిగిన ప్రోటీన్‌కు మంచి మూలం. విటమిన్ ‘డి’ లభించే అతికొద్ది ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. దీనిలో బయోటిన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ మనం తిన్న ఆహారంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా మంది గుడ్డులోని పచ్చ సొన తినడానికి ఇష్టపడరు. తెల్లసొనను మాత్రమే తింటుంటారు. దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటుందని వారి నమ్మకం. ఐతే విటమిన్ ఎ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు గుడ్డులోని పచ్చసొనలోనే ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా పచ్చసొనలో బి-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి.
గుడ్డులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకొకటి తింటే చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇలా ఇది పరోక్షంగా బరువు తగ్గటానికీ కూడా తోడ్పడుతుంది. కణాల పనితీరు, వాటి ఎదుగుదల, శక్తిని అందించటం వంటి పలు జీవక్రియలకు అవసరమైన పోషకాలు గుడ్డుతో అధికంగా ఉంటాయి. పచ్చసొనలో ఐరన్ కూడా ఉంటుంది. గుడ్డులోని ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ ఇది దోహద పడుతుంది. రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం ముప్పు 12 శాతం వరకు తక్కువగా ఉంటుందని పరిశోధనలు సైతం వెల్లడించాయి.