అన్ని రకాల వంటల్లో నూనె (Cooking Oil) తప్పనిసరి. పోపు వేయాలన్నా, వేపుళ్లు చేయాలన్నా, పొడులు చేయాలన్నా నూనె అత్యవసర పదార్థం. నూనె లేని వంటకాలను ఊహించుకోలేం. అయితే అధిక నూనె వినియోగం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు వైద్యులు, నిపుణులు కూడా నూనె వాడకంపై సూచనలు ఇస్తూ ఉంటారు. అధిక నూనె వల్ల శరీరంలో అనవసరపు కొవ్వు పేరుకుంటుంది. అది రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. తద్వారా గుండె సంబంధిత (Heart Problems) సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వంటలో ఉపయోగించే నూనెతో సహా ప్రతిరోజూ 3-4 టీ స్పూన్లు శరీర అవసరాలకు సరిపోతుంది. నూనెల్లోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరం కాబట్టి నూనె లేని ఆహారం తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎయిమ్స్ వైద్యుల ప్రకారం నూనెలోని మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ రక్తంలోని కొవ్వులను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తుందని తేలింది. ఈ రకమైన కొవ్వు ఆలివ్ నూనె, కనోలా నూనెలో అధికంగా ఉంటుంది. అవోకాడోలు, పిస్తా, వాల్‌నట్, బాదం, నువ్వులు నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధిక మొత్తంలో లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల పరిస్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులను నివారించడం, ఆయుర్దాయాన్ని పెంచేందుకు నూనెలోని ఈ కొవ్వు ఉపయోగపడుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలా మంది చేపలు తినేందుకు ఆసక్తి చూపించరు. కాబట్టి వారికి ఈ ఫ్యాటీ ఆమ్లాల్లోని పోషకాలు లభించవు. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కాబట్టి నూనెలను తగినంత మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాల్‌నట్‌లు, ఆవాలు, సోయాబీన్, నువ్వులు, వేరుశనగ, కనోలా నూనె, అవిసె గింజలు, చియా గింజలతో తయారైన నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉపయోగించే కొబ్బరి నూనెలోనూ సంతృప్త కొవ్వులు, పాల్మిటిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే.. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు నూనెను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శరీరానికి అవసరమైనంత మేరకే తీసుకోవడం ఉత్తమం. మొతాదు మించితే పెను ఆరోగ్య సమస్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం