
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దేనికోసం పరితపిస్తాడు..? అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క సమాధానం.. సంతోషం. కానీ ఆ సంతోషం ఎందులో ఉంది..? కోట్లాది రూపాయల సంపదలోనా..? ప్రపంచం గర్వించే కీర్తిలోనా..? లేక ఉన్నత పదవుల్లోనా..? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఏకంగా 85 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పరిశోధన నిర్వహించింది. 1938లో ప్రారంభమైన ఈ అధ్యయనంలో తేలిన ఆశ్చర్యకరమైన నిజాలు మన జీవితం పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చేలా ఉన్నాయి.
ఈ పరిశోధన 1938లో హార్వర్డ్ విద్యార్థులు.. బోస్టన్‌లోని నిరుపేద కుటుంబాలకు చెందిన మొత్తం 724 మంది పురుషులతో ప్రారంభమైంది. దశాబ్దాల కాలంలో వారి వివాహాలు, ఉద్యోగాలు, అనారోగ్యాలు, విజయాలు, వైఫల్యాలను పరిశోధకులు నిశితంగా గమనించారు. ప్రస్తుతం వారి వారసులు కలిపి మొత్తం 1,300 మందిపై ఈ అధ్యయనం కొనసాగుతోంది.
చాలామంది తమను డబ్బు లేదా కీర్తి సంతోషపరుస్తుందని భావించారు. కానీ 85 ఏళ్ల తర్వాత తేలిందేమిటంటే.. ఆనందానికి, ఆరోగ్యానికి మూలం సంపద కాదు.. మనకు ఇతరులతో ఉన్న సంబంధాలే. అధ్యయన డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ వాల్డింగర్ ప్రకారం.. మంచి సంబంధాలు మనల్ని సంతోషంగా ఉంచడమే కాకుండా మన మెదడును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒంటరితనం మనిషిని లోలోపల చంపేస్తుంది.
మంచి సంబంధాలు: మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారనేది ముఖ్యం కాదు మన కష్టసుఖాల్లో తోడుండే నమ్మకమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారనేదే ముఖ్యం. లోతైన బంధాలే మనకు రక్షణ కవచాలు.
భావోద్వేగ స్థిరత్వం: ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాం.. సమస్యల నుంచి ఎంత త్వరగా కోలుకుంటాం అనే దానిపైనే మన ఆనందం ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యకరమైన అలవాట్లు: వ్యాయామం, సమతుల్య ఆహారం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం లభిస్తుంది.
సామాజిక పరిస్థితులు: మన చుట్టూ ఉన్న సమాజంతో కలిసి మెలిసి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం వల్ల జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది.
ఉద్దేశపూర్వక పని: చేసే పనిలో సంతృప్తి, రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం మనిషిని ఉత్సాహంగా ఉంచుతుంది.
బాల్య వాతావరణం: చిన్నతనంలో లభించే ప్రేమ, భద్రత మనిషి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తు బంధాలను బలంగా మలుస్తాయి.
సోషల్ ఫిట్‌నెస్ : శరీరానికి వ్యాయామం ఎలాగో, సంబంధాలకు కూడా నిరంతర సంభాషణలు, ప్రేమ అవసరం. సంబంధాలను ఎప్పటికప్పుడు పోషించుకోవాలి.
డబ్బు అవసరమే కానీ అది కేవలం సౌకర్యాలను మాత్రమే ఇవ్వగలదు. నిజమైన ఆనందం మనం మన కుటుంబంతో, స్నేహితులతో పంచుకునే ప్రేమలో ఉంది. “మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో.. మీ బంధాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఈ అధ్యయనం మనకు బోధిస్తోంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.