పిల్లల ఎదుగుదలపై అనుమానాలా? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే మంచి ఆహారంతో పాటు క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. రాత్రి వేళల్లో తగినంత నిద్ర, రోజూ ఆరుబయట ఆటలు ఆడటం, వ్యాయామం చేయడం వంటివి పిల్లల ఎత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజులో పుష్కలంగా నీరు తాగేలా చూడాలి.

పిల్లల ఎదుగుదలపై అనుమానాలా? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Child Height.jpg

Updated on: Jun 05, 2026 | 10:50 PM

ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలు మాత్రమే కాకుండా, వారు తీసుకునే ఆహారం, జీవనశైలి అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, అది ఎముకలు, కండరాల బలాన్ని తగ్గించి సహజసిద్ధమైన ఎదుగుదలను మందగింపజేస్తుంది. పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత.

ఎత్తు పెరగడానికి పంచ సూత్రాలు

పిల్లలు చక్కగా ఎత్తు పెరగడానికి ప్రధానంగా ఐదు రకాల పోషకాలు తోడ్పడతాయి.

  • ప్రోటీన్: శరీరంలోని కండరాలు, కొత్త కణజాలాల పెరుగుదలకు ఇది ప్రాణం. పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, సోయా వంటి వాటిని ఆహారంలో చేర్చాలి.
  • కాల్షియం: ఎముకలను దృఢంగా మార్చడానికి పాలు, పెరుగు, పనీర్ మరియు ఆకుకూరలు అవసరం.
  • విటమిన్-డి: ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్-డి తప్పనిసరి. ఉదయపు లేత సూర్యరశ్మి దీనికి మంచి మూలం.
  • ఐరన్ (ఇనుము): శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఇది ఎంతో అవసరం. ఐరన్ లోపం పిల్లల్లో బలహీనతకు దారితీస్తుంది.
  • జింక్, మెగ్నీషియం: ఈ ఖనిజాలు శరీర సాధారణ ఎదుగుదలతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

దూరంగా ఉంచాల్సిన..

పిల్లల ఎదుగుదలకు అడ్డుపడే కొన్ని అలవాట్లను తల్లిదండ్రులు గమనించాలి. జంక్ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పానీయాలు పిల్లల ఆరోగ్యానికి హానికరం. అలాగే ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం వంటివి ఎత్తు పెరగకుండా ఆటంకం కలిగిస్తాయి. పిల్లల ఎత్తు, సరైన శారీరక అభివృద్ధికి సమతుల్య ఆహారం, మంచి జీవనశైలి చాలా ముఖ్యం. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినా ఎదుగుదలపై సందేహాలు ఉంటే, సొంత వైద్యం చేయకుండా నిపుణులైన వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం.

Follow Us