
Golden Deer Moral Story: మనిషి జీవితంలో సంతృప్తి అనేది ఎంతో గొప్ప సంపద. ఉన్నదానితో సంతోషంగా జీవించడం నేర్చుకున్నవారే నిజమైన ఆనందాన్ని పొందుతారు. కానీ అత్యాశ మనిషిని ఎంతటి కష్టాల్లోకి నెట్టేస్తుందో వివరించే ఎన్నో నీతి కథలు ఉన్నాయి. అలాంటి చక్కని జానపద కథే ‘బంగారు జింక – రంగయ్య’ కథ. అత్యాశతో చివరకు దు:ఖమే మిగులుతుందని ఈ కథలో వివరించడం జరిగింది.
ఒక గ్రామంలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అతని భార్య కమలమ్మకు మాత్రం ఎప్పుడూ ఇంకా ఎక్కువ కావాలనే ఆశ ఉండేది. ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా వేటగాళ్లు వేసిన వలలో ఒక అందమైన బంగారు జింక చిక్కుకుని బాధపడుతుండటం రంగయ్య చూశాడు. దానిపై జాలి వేసిన అతను తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జింకను విడిపించాడు. రంగయ్య మంచితనానికి మెచ్చిన జింక..”నువ్వు ఏది కోరితే అది ఇస్తాను” అని వరం ఇచ్చింది. అయితే రంగయ్య తన భార్యను అడిగి వస్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు.
జరిగిన విషయం తెలుసుకున్న కమలమ్మ ముందుగా ఒక మంచి ఇల్లు కావాలని కోరింది. రంగయ్య అడగగానే బంగారు జింక అందమైన ఇంటిని ఇచ్చింది. కొన్ని రోజులకు ఆ ఇల్లు సరిపోలేదని భావించిన కమలమ్మ, మేడ కావాలని కోరింది. ఆ కోరిక కూడా నెరవేరింది. ఆ తర్వాత ఒక రాజ్యానికి రాణి కావాలని ఆశపడింది. బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది.
అంతటి సంపద, గౌరవం వచ్చినా కమలమ్మ మనసు తృప్తి చెందలేదు. చివరకు సూర్యుడు, చంద్రుడు కూడా తన ఇంట్లో ఉండాలని కోరుకుంది. భార్య అడిగిన ఆ కోరికను రంగయ్య బంగారు జింకకు చెప్పగానే, జింకకు తీవ్ర కోపం వచ్చింది. “ఇంతటి అత్యాశ మంచిది కాదు. సూర్యచంద్రులు నీ ఇంట్లో ఉండాలంటే మీరు చెట్టు కిందే ఉండాలి” అని చెప్పి, ఇప్పటివరకు ఇచ్చిన ఇల్లు, మేడ, రాజ్యం అన్నింటినీ వెనక్కి తీసుకుంది. క్షణాల్లోనే ఆ వైభవం అంతా మాయమైంది.
రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఇల్లు లేదు, రాజ్యం లేదు. కమలమ్మ పాత బట్టలతో ఒక చెట్టు కింద కూర్చుని తన అత్యాశ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతూ కనిపించింది. అప్పుడే ఆమెకు నిజమైన సంతోషం సంపదలో కాదని, సంతృప్తిలోనే ఉంటుందని అర్థమైంది.
“దురాశ దుఃఖానికి చేటు” అనే సామెతను ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. మనకు ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ లేనిదాని కోసం అత్యాశపడితే, చివరికి ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ జానపద కథ పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా జీవితంలో సంతృప్తి, వినయం, అత్యాశ వల్ల కలిగే నష్టాలను గుర్తు చేసే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
Also Read: నిజాయితీకి ప్రతిఫలం తథ్యం.. గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం