AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా మ్యూజియంలో భారతీయ ‘చీర’..! మంగళ్‌యాన్ విజయంలో కీలకపాత్ర పోషించింది ఎవరు?

వాషింగ్టన్ డి.సి.లోని ప్రఖ్యాత స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రపంచ ప్రసిద్ధ విమానాలు, అంతరిక్ష పరికరాల మధ్య ఒక సాధారణ భారతీయ చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చీర భూ వాతావరణాన్ని దాటి వెళ్లకపోయినా, దానిని ధరించిన మహిళ మాత్రం భారతదేశం అంగారక గ్రహాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ఎవరో కాదు, ఇస్రో గర్వించదగ్గ శాస్త్రవేత్త నందిని హరినాథ్.

అమెరికా మ్యూజియంలో భారతీయ ‘చీర’..! మంగళ్‌యాన్ విజయంలో కీలకపాత్ర పోషించింది ఎవరు?
Nandini Harinath Saree
Nikhil
|

Updated on: May 13, 2026 | 6:40 AM

Share

నందిని హరినాథ్ అంతరిక్షం వైపు అడుగులు వేయడానికి కారణం ‘స్టార్ ట్రెక్’ అనే టీవీ సీరియల్. చిన్నప్పుడు తన కుటుంబం మొత్తంతో కలిసి ఆ సీరియల్‌ను ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూసేవారట. ఆ ఆసక్తితోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇస్రోలో చేరారు. మంగళ్‌యాన్ మిషన్ విజయవంతమైన సమయంలో ఆమె ధరించిన చీర, నేడు భారతీయ మహిళా శాస్త్రవేత్తల నైపుణ్యానికి, దేశ కీర్తికి ప్రతీకగా అమెరికా మ్యూజియంలో కొలువైంది.

మంగళ్‌యాన్ మిషన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM) లేదా మంగళ్‌యాన్ విజయంలో నందిని హరినాథ్ పాత్ర మరువలేనిది. ఆమె ఈ మిషన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నవంబర్ 5, 2013న ప్రారంభమైన ఈ మిషన్, సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. కేవలం ఆరు నుండి పది నెలల కాలపరిమితితో పంపిన ఈ ఆర్బిటర్, అంచనాలను మించి ఏకంగా ఎనిమిదేళ్ల పాటు అంగారక కక్ష్యలో ఉండి విలువైన సమాచారాన్ని అందించింది.

నందిని తన 20 ఏళ్ల కెరీర్‌లో 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. మంగళ్‌యాన్ విజయం తర్వాత సాక్షాత్తు ప్రధాన మంత్రి ఆమెను అభినందించారు. నాసా వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇస్రో నైపుణ్యాన్ని గుర్తించి, కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి. “మేము పనిచేసే ప్రతి మిషన్ ముఖ్యమే, కానీ మంగళ్‌యాన్ మాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది” అని ఆమె గర్వంగా చెబుతారు.

మ్యూజియంలో ఆ చీర ఎందుకు?

స్మిత్సోనియన్ మ్యూజియం నందిని హరినాథ్ ధరించిన చీరను ప్రదర్శనకు ఉంచడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. ఆ మిషన్ సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపును, అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రతిబింబిస్తాయి. మ్యూజియం పంచుకున్న వీడియోలో ఆ చీర నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలం రంగుల కలయికతో ఎంతో హుందాగా కనిపిస్తుంది.

ఒకవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు దేశం గర్వించేలా అంతరిక్ష పరిశోధనలు చేస్తూ నందిని హరినాథ్ వంటి మహిళలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఇష్టపడే ‘అపోలో 13’ సినిమాలో లాగే, టీమ్ వర్క్ తో ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు.

Follow Us