Expensive Watermelon: ప్రపంచంలో అరుదైన నల్లని పుచ్చకాయ.. దీని ధర తెలిస్తే మతిపోవాల్సిందే

|

Apr 20, 2022 | 9:13 AM

Expensive Watermelon: ప్రకృతి ప్రసాదం పండ్లు.. ఏ సీజన్ లో దొరికే పండ్లు.. ఆ సీజన్ లో తినడం వలన రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక వేసవి (Summer Season) వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి పుచ్చకాయ ..

Expensive Watermelon: ప్రపంచంలో అరుదైన నల్లని పుచ్చకాయ.. దీని ధర తెలిస్తే మతిపోవాల్సిందే
Black Watermelon
Follow us on

Expensive Watermelon: ప్రకృతి ప్రసాదం పండ్లు.. ఏ సీజన్ లో దొరికే పండ్లు.. ఆ సీజన్ లో తినడం వలన రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక వేసవి (Summer Season) వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి పుచ్చకాయ మీదనే ఉంటుంది. దాహార్తిని తీర్చుకోవటానికి పుచ్చకాయను ఇష్టంగా తింటారు. ఎరుపు రంగు ముక్కలమీద నల్లటి చుక్కను అద్దినట్లు.. గింజలతో చూడగానే నోరూరించే పుచ్చపండును అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడిప్పుడే మార్కెట్ లో పసుపు రంగు పుచ్చకాయలు కూడా లభ్యమవుతున్నాయి. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడమే కాదు.. ఆరోగ్యానికి ఇచ్చే పుచ్చకాయకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత డిమాండ్ ఉన్నా సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉంటాయి. ఎంత సీజనలోనైనా కేజీ పుచ్చకాయ.. మహా అయితే.. వంద రూపాయలు ఉంటుందూమో.. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి తెలుసుకుందాం..గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న పుచ్చకాయ ధర తెలిస్తే.. షాక్ తింటారు.. ఎందుకంటే ఈ పుచ్చకాయ ఒకటి రూ. 19 వేల నుంచి రకాన్ని బట్టి రూ. 4లక్షల వరకూ పలుకుతుంది. మరి ఆ పుచ్చకాయ ప్రత్యేక ఏమిటి..? ఎంత ధర పలుకుతుందో తెలుసుకుందాం..!

పుచ్చకాయలు సాధారణంగా లేత, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా అందరూ చూసే పుచ్చకాయలు. అయితే నల్లగా నిగనిగలాడే పుచ్చకాయలుకూడా ఉన్నాయి. అయితే ఇవి అరుదుగా కనిపిస్తాయి. డెన్సుక్ జాతికి చెందిన ఈ పుచ్చకాయలను నల్ల పుచ్చకాయలు అని కూడా అంటారు. జపాన్‌లోని హక్కైడో ద్వీపం ఉత్తర ప్రాంతంలో మాత్రమేపండిస్తారు. మొత్తం సంవత్సరానికి 100 ముక్కలు మాత్రమే పెరుగుతాయి. ఈ అరుదైన పుచ్చకాయల దిగుబడి కూడా చాలా తక్కువ. ఫుట్‌బాల్‌ ఆకారంలో గుండ్రంగా ఉండే ఈ పుచ్చకాయలను కొనడానికి ఇతర దేశాలవారూ కూడా పోటీ పడతారు. అంతేకాదు ఈ పుచ్చకాయ పండ్ల మార్కెట్‌లో దొరకడం చాలా కష్టం. వేలం వేస్తారు. పుచ్చకాయ 4.5 లక్షలకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది.

ఈ పుచ్చకాయలోని కొన్ని లక్షణాలు దీని ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దాని బాహ్య రూపం నల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఇతర పుచ్చకాయలతో పోలిస్తే, ఈ పుచ్చకాయ రుచిలో తియ్యగా, తక్కువ గింజలను కలిగి ఉంటుంది. రూపులో మాత్రమే కాదు రుచిలోనూ వీటికి సాటి లేదని కొనుగోలు చేసిన వారు చెప్తారు. మార్కెట్లో లభ్యమయ్యే సాధారణ రకాలకన్నా ఎన్నో రెట్లు తీయగా ఉండటమే కాకుండా పోషకవిలువల్లోనూ మేటి అంటున్నారు వీటిని సాగు చేసే రైతులు. అయితే వీటిని పండించడం అంటే కత్తిమీద సామేనట. పూత దగ్గర నుంచి కోత కోసే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీనికి అనువైన వాతావరణం అంతటా ఉండదు. అందుకే ఏటా కేవలం కొన్ని పండ్లను మాత్రమే పండిస్తున్నారు. అందుకనే ఈ పుచ్చకాయలు సాధారణ పుచ్చకాయల వలె ఏ దుకాణంలోనూ అమ్మకానికి పెట్టరు.

ప్రతి సంవత్సరం వేలం వేస్తారు. ఈ పుచ్చకాయను దక్కించుకోవడానికి పెద్దపెద్ద బిడ్డర్లు హాజరవుతారు. వేలంలో పుచ్చకాయను రూ.వేలు, లక్షల రూపాయలకు దక్కించుకుంటారు. వీటిని శుభకార్యాలు ఇతర వేడుకల్లో బహుమతులుగా ఇస్తారు. అందుకు అనువుగా వీటి ప్యాకింగ్‌ కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. దానిపై ఈ ప్రత్యేక పళ్ల రకం నాణ్యతను సూచించేలా ఓ లేబుల్‌ను కూడా అతికిస్తారు. అయితే గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఈ అరుదైన వాటిపై కూడా ప్రభావం చూపింది. వీటి ధర బాగా తగ్గింది. అయినప్పటికీ.. నల్ల పుచ్చకాయ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన పుచ్చకాయగా ఖ్యాతిగాంచింది.

Also Read: Water RS 1.30: బిందె నీళ్లు రూ.1.30 లక్షలు.. ఈ నీటితో స్నానం చేస్తే సంతానప్రాప్తి..! ఎక్కడో తెలుసా..?