ప్రపంచంలోనే ఎక్కువగా తినే పండు ఏదో తెలుసా..? మీరు అనుకునేది అయితే అస్సలు కాదు..
ఆరోగ్యానికి ఆపిల్ మంచిదంటారు.. వేసవిలో మామిడి పండ్లను అమృతంలా తింటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎక్కువగా తినే నంబర్ వన్ పండు ఏదో తెలుసా? ఆపిల్, మామిడి, పుచ్చకాయలను కూడా వెనక్కి నెట్టి.. ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న ఆ సూపర్ ఫ్రూట్ మరేదో కాదు.. అరటిపండు.. అసలు దీనికి అంత క్రేజ్ ఎందుకు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వాటిలో పండ్లు ముఖ్యమైనవి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం డాక్టర్లు మనల్ని ఆపిల్స్ తినమని సలహా ఇస్తుంటారు. అలాగే సీజన్‌ను బట్టి మనం మామిడి, పుచ్చకాయలు వంటి రకరకాల పండ్లను తింటుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా ఇష్టపడి తినే పండు ఏదో మీకు తెలుసా? దీన్ని గురించి చాలా మందికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినేది అరటి పండు. ప్రపంచంలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన రుచి, పోషక విలువలు, అందరికీ అందుబాటులో ఉండే ధర. పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు దీనిని ఇష్టంగా తింటారు. ఏడాది పొడవునా లభించడం, తొక్క వలవడం సులభం కావడం దీని ప్రత్యేకత. కేవలం పండుగానే కాకుండా స్మూతీలు, స్వీట్లు, చిప్స్, బేకరీ ప్రొడక్ట్స్, చిన్న పిల్లల ఆహార తయారీలో అరటిపండును విరివిగా ఉపయోగిస్తారు. అరటిపండులోని సహజమైన తీపి, ఇది శరీరానికి అందించే తక్షణ శక్తి కారణంగా క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.
ఉత్పత్తిలో రారాజు భారత్
ప్రపంచంలోనే అత్యధికంగా అరటిపండ్లను పండించే దేశంగా మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, విస్తారమైన సాగుభూమి అరటిపండ్ల భారీ ఉత్పత్తికి ఎంతగానో దోహదపడుతున్నాయి. భారతదేశంతో పాటు చైనా, ఇండోనేషియా, బ్రెజిల్, ఈక్వెడార్ వంటి ఉష్ణమండల దేశాలు కూడా అరటిపండ్లను పెద్ద ఎత్తున పండిస్తూ ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నాయి.
అరటిపండుతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అరటిపండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాల గని. దీని వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు…
పోషకాల నిధి: ఇందులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మేలు: అరటిపండులోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియ మెరుగు: ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఎముకల బలం: క్రమం తప్పకుండా అరటిపండ్లను తినడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి.
