30 రోజులు షుగర్ తినటం మానేస్తే మన శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. వావ్ అస్సలు నమ్మలేరు..
కేవలం 30 రోజుల పాటు పంచదారకు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, చర్మం నిగారింపు, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, ఫ్యాటీ లివర్ సమస్య తగ్గడం, ప్రశాంతమైన నిద్ర, మధుమేహం ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించవచ్చని పేర్కొంటున్నారు.

మన ఆధునిక జీవనశైలిలో పంచదార వినియోగం విపరీతంగా పెరిగింది. కాఫీ, టీ వంటి రోజువారీ పానీయాల నుండి బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాల వరకు ప్రతిచోటా పంచదార దాగి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు చాలా కాలంగా పంచదార అధిక వినియోగం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణమని హెచ్చరిస్తున్నారు. షుగర్‌కు దూరంగా ఉండాలని వారు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేవలం 30 రోజుల పాటు పంచదారకు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం..
30 రోజుల పాటు పంచదార మానేస్తే.. శరీరంలో ఊహించని మార్పులను చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువులో స్పష్టమైన మార్పు : పంచదారను మానేయడం వల్ల శరీరంలోకి వెళ్లే అనవసరపు కేలరీలు గణనీయంగా తగ్గుతాయి. పంచదార అధిక కేలరీల మూలం, కానీ పోషకాలు తక్కువ. దీని వినియోగం తగ్గడం వల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడం ప్రారంభమవుతుంది. నెల రోజుల్లోనే మీ బరువులో స్పష్టమైన మార్పును మీరు గమనించవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు ఇది ఒక బలమైన పునాది అవుతుంది.
చర్మం నిగారింపు, యవ్వన ప్రకాశం
అధిక షుగర్ తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోస్, కొలాజెన్ తో కలిసి గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారి తీస్తుంది. ఈ ప్రక్రియ చర్మంపై ముడతలు, మొటిమలు రావడానికి కారణమవుతుంది. 30 రోజుల పాటు పంచదారను మానేస్తే, గ్లైకేషన్ ప్రక్రియ మందగించి, చర్మం మళ్లీ తన సహజమైన నిగారింపును సంతరించుకుంటుంది. మీ వయసు మరింత యవ్వనంగా, తాజాగా కనిపిస్తుంది.
గుండె ఆరోగ్యం మెరుగుదల
అధిక చక్కెర వినియోగం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఒక నెల పాటు పంచదారకు దూరంగా ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొవ్వు కాలేయ సమస్యకు చెక్
మనం తినే చక్కెరను కాలేయం మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అధిక మొత్తంలో పంచదార తీసుకున్నప్పుడు, కాలేయం ఆ చక్కెరను కొవ్వుగా మార్చి తనలో నిల్వ చేసుకుంటుంది. ఇది కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) సమస్యకు దారి తీస్తుంది. పంచదారను మానేయడం వల్ల కాలేయం తనను తాను శుభ్రం చేసుకొని, పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది.. టాక్సిన్స్ ను బయటకు పంపించేస్తుంది.
ప్రశాంతమైన నిద్ర, మెరుగైన మానసిక స్థితి
చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పంచదారను మానేసిన మొదటి వారం కాస్త ఇబ్బందిగా, క్రేవింగ్స్ తో కూడుకున్నదిగా అనిపించినా, ఆ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడి రాత్రి పూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర వస్తుంది. ఇది మూడ్ స్వింగ్స్ ను తగ్గించి, మానసిక స్థితిని స్థిరీకరిస్తుంది.
మధుమేహం ముప్పు మాయం
శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్లే టైప్ 2 మధుమేహం వస్తుంది. నెల రోజుల పాటు పంచదార తీసుకోకపోతే, ప్యాంక్రియాస్ పై ఒత్తిడి తగ్గి, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చి, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి కూడా చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి.
30 రోజుల నో షుగర్ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి మూడు నుండి నాలుగు రోజులు క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మైండ్ గేమ్‌ను దాటి 30 రోజులు కంప్లీట్ చేయగలిగితే, మీ శరీరం సరికొత్తగా మారుతుంది. అయితే, పంచదార మానేయడం అంటే కేవలం తెల్లటి షుగర్ మాత్రమే కాదు, ప్రాసెస్డ్ ఫూడ్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
