
పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. పాలు సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లతో నిండిన పాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాలు తాగిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తప్పు ఆహార కలయికలు జీర్ణ సమస్యలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పాలు చల్లని స్వభావం కలిగిన ఆహారం. దీనికి విరుద్ధ గుణాలు ఉన్న పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ దెబ్బతింటుంది. ముఖ్యంగా పాలు తాగిన వెంటనే పుల్లటి పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిమ్మకాయ, కమలాపండు, మోసంబి, ద్రాక్ష వంటి సిట్రస్ ఫలాలు పాలతో కలిసి కడుపులో రియాక్షన్‌కు దారితీసి అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగించవచ్చు.
అలాగే చేపలు, మాంసాహార పదార్థాలు తీసుకున్న వెంటనే పాలు తాగడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఈ కలయిక శరీరంలో టాక్సిన్లు పెరగడానికి కారణమవుతుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. కొందరిలో చర్మ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలతో పాటు పెరుగు తీసుకోవడంపై కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. పాలు, పెరుగు రెండూ పోషకాహారాలే అయినప్పటికీ.. ఒకేసారి కలిపి తీసుకుంటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పాలు, పెరుగు కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని సంప్రదాయ ఆహారాల్లో ఈ కలయికను ప్రత్యేక పద్ధతుల్లో ఉపయోగిస్తారని, అవి సాధారణంగా హానికరం కాదని పేర్కొంటున్నారు.
పాలు పులవనివి, పెరుగు పులిసినది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, పాలు లేదా పెరుగు ఏదో ఒకదానిని వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
పాలతో పాటు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు కూడా వెంటనే తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చని పేర్కొంటున్నారు.
ఇంకా అరటి పండుతో పాలు తీసుకోవడం చాలా మంది అలవాటుగా చేసుకుంటారు. అయితే ఇది అందరికీ సరిపోదని, కొందరిలో జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
పాలు తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట గ్యాప్ ఇచ్చి ఇతర ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహార కలయికలు పాటిస్తేనే పాలలోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతున్నారు.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..