
మినప సున్నుండలు.. నల్ల మినుములతో తయారుచేసే బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన సాంప్రదాయ పిండి వంటకం.. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, శారీరక శక్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గొప్పగా సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లలకు బలాన్నిచ్చి, పెద్దలలో నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, నీరసం వంటి సమస్యలను తగ్గించడానికి సున్నుండలు చాలా ఉపయోగపడతాయి. మినప లడ్డులో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన సాంప్రదాయ లడ్డూల్లో.. మినపప్పు, బెల్లం, నెయ్యి ఉండటం వల్ల, ఇవి ఎముకల బలానికి, జీర్ణక్రియకు, చిన్న పిల్లల ఎదుగుదలకు, నడుము నొప్పి తగ్గడానికి చాలా మంచిది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.. ఇవి తక్షణ శక్తిని అందివ్వడంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ మినపలడ్డు బాలింతలకు నడుము నొప్పి తగ్గించి, బలాన్ని ఇస్తుంది. పిల్లల ఎదుగుదలకు, జ్ఞాపకశక్తికి మంచిది. అంతేకాకుండా.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఎముకల బలానికి సహాయపడుతుంది. బెల్లం సున్నండలు తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య కూడా దూరమవుతుంది.
సున్నుండలు తయారుచేయడానికి నల్ల మినుములను మాత్రమే ఉపయోగించడం మంచిది. సుమారు ఒకటిన్నర కిలోల నల్ల మినుములను తీసుకుని, వాటిని ఒకేసారి లేదా కొన్ని కొన్ని భాగాలుగా విడదీసి వేయించుకోవాలి. స్టవ్ ను సిమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు వేయించుకోవాలి. మినుములు మంచి సువాసన వచ్చి, రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఈ విధంగా మిగిలిన మినుములను కూడా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల సున్నుండలు రుచికరంగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
వేయించిన మినుములను మర పట్టి లేదా మిక్సీలో మెత్తటి పొడిగా చేసుకోవాలి. అదే విధంగా, ఒకటిన్నర కిలోల బెల్లంను కూడా తీసుకుని.. పాకం తయారు చేసుకోవాలి. తురిమిన బెల్లం, నెయ్యి కలిపి ఈ లడ్డూలు తయారు చేసుకోవాలి.. పాకం లేదా బెల్లం, మినప పొడిని పొడిని ఒక పెద్ద పాత్రలో వేసి, ఉండలు లేకుండా చేత్తో లేదా గరిటెతో బాగా కలపాలి. ఇది సున్నుండల తయారీలో ముఖ్యమైన దశ, ఎందుకంటే పొడులు సమానంగా కలవకపోతే ఒక దగ్గర తీపి ఎక్కువగా, ఇంకో దగ్గర తక్కువగా ఉండవచ్చు.
పొడులు బాగా కలిపిన తర్వాత, కొద్దికొద్దిగా వేడి చేసిన నెయ్యిని కలుపుతూ సున్నుండలను చుట్టుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటే ఉండలు చక్కగా వస్తాయి. నెయ్యి కూడా తక్కువ పడుతుంది. మీకు నచ్చిన పరిమాణంలో సున్నుండలను తయారు చేసుకోవచ్చు. కావాలనుకుంటే, సువాసన కోసం యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు.. అయితే కలపకపోయినా రుచి బాగుంటుంది. ఇలా తయారుచేసిన సున్నుండలను నిల్వ ఉంచుకుని, రోజుకు ఒకటి లేదా రెండు తినడం ద్వారా శారీరక బలాన్ని పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..