
మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. పని ఒత్తిడిలో ఉన్నా, అలసటగా అనిపించినా వెంటనే ఈ రెండింటిలో ఒకదానిపై ఆధారపడతాం. అయితే ఇవి కేవలం మనకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు.. మన ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం.. ఎముకల బలం విషయంలో కాఫీ కంటే టీ కొంచెం మెరుగైన ఫలితాలను ఇస్తుందని తేలింది.
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 65 ఏళ్లు పైబడిన సుమారు 10,000 మంది మహిళలపై సుదీర్ఘ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను ప్రముఖ న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే.. కాఫీ తాగేవారితో పోలిస్తే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో తుంటి ఎముక ఖనిజ సాంద్రత ఎక్కువగా ఉంటోంది. టీలో ఉండే కాటెచిన్స్ వంటి రసాయన సమ్మేళనాలు ఎముకల నిర్మాణానికి అవసరమైన కణాలను ఉత్తేజపరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇవి ఎముకల సాంద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కాఫీని మితంగా తాగడం వల్ల నష్టం లేకపోయినా అతిగా తాగడం మాత్రం ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ సర్వే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగే వారిలో ఎముకల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోయే అవకాశం పెరుగుతుంది.
కేవలం కాఫీ తాగడం వల్ల మాత్రమే కాకుండా ఈ క్రింది అంశాలు కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..
టీ లేదా కాఫీ ఏదైనా సరే.. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ మీరు మీ ఎముకలను దృఢంగా ఉంచుకోవాలనుకుంటే కాఫీ కంటే టీకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని ఈ తాజా అధ్యయనం సూచిస్తోంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.