Sri Lankan Chicken Curry Recipe: శ్రీలంకన్ చికెన్ కర్రీ.. స్పెషల్ మసాలాతో ఇలా వండితే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!

చికెన్ అంటేనే నాన్ వెజ్ ప్రియులకు ప్రాణం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన మసాలాలతో కాకుండా, శ్రీలంక స్టైల్‌లో చికెన్ కర్రీని ఎప్పుడైనా రుచి చూశారా? అక్కడి వంటకాల్లో కొబ్బరి పాలు ప్రత్యేకంగా వేయించి పొడి చేసిన మసాలాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ సాధారణ కూరల కంటే భిన్నమైన ఫ్లేవర్‌తో, క్రీమీగా, కారంగా ఉండి నోరూరిస్తుంది. అన్నం, పులావ్ లేదా రోటీల్లోకి ఈ కర్రీ ఒక అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Sri Lankan Chicken Curry Recipe: శ్రీలంకన్ చికెన్ కర్రీ.. స్పెషల్ మసాలాతో ఇలా వండితే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Sri Lankan Chicken Curry Recipe

Updated on: Jan 22, 2026 | 5:26 PM

శ్రీలంకన్ చికెన్ కర్రీ ప్రత్యేకత అంతా అందులో వాడే ‘శ్రీలంకన్ స్పెషల్ మసాలా’లోనే ఉంది. మనం రెగ్యులర్‌గా వాడే గరం మసాలాలకు భిన్నంగా, కొన్ని దినుసులను దోరగా వేయించి అప్పటికప్పుడు పొడి చేసి వేయడం వల్ల ఈ కూరకు ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. దీనికి తోడు చివర్లో యాడ్ చేసే కొబ్బరి పాలు కూరకు మంచి చిక్కదనాన్ని, తియ్యటి టచ్‌ను ఇస్తాయి. ఇంటిల్లిపాదీ మెచ్చేలా, అతిథులు ఫిదా అయ్యేలా ఈ స్పెషల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

చికెన్: అర కిలో

టమాటా ముక్కలు: 1 కప్పు

ఉల్లిపాయలు: 2 (చిన్నవి)

పచ్చిమిర్చి: 5 లేదా 6

కారం: రుచికి తగినంత

ఉప్పు: రుచికి సరిపడా

పసుపు: కొద్దిగా

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్

శ్రీలంకన్ చికెన్ మసాలా: 3 టేబుల్ స్పూన్లు

గరం మసాలా: 1 టీస్పూన్

ధనియాల పొడి: 1 టీస్పూన్

జీలకర్ర పొడి: 1 టీస్పూన్

కొబ్బరి పాలు: 1 కప్పు

కరివేపాకు: రెండు రెమ్మలు

నూనె: తగినంత

కొత్తిమీర తరుగు: కొద్దిగా

శ్రీలంకన్ స్పెషల్ మసాలా తయారీ:

ఈ రెసిపీకి ఇదే ప్రాణం. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, కొద్దిగా మెంతులు కరివేపాకు వేసి రంగు మారే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఇచ్చే సువాసనే శ్రీలంకన్ కర్రీకి అసలైన గుర్తింపు.

తయారీ విధానం :

ముందుగా అరకిలో చికెన్ శుభ్రం చేసి ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లతో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగును ఎర్రగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక, ఉడికించిన చికెన్ టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మగ్గాక ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.

చివరగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న శ్రీలంకన్ స్పెషల్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అసలైన పదార్థం కొబ్బరి పాలు మరియు ఒక కప్పు నీళ్లు పోసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. కూర దగ్గరపడి నూనె పైకి తేలే వరకు ఉడికించి, కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.

చిట్కాలు:

చికెన్‌ను ముందుగానే ఉడికించుకోవడం వల్ల వంట త్వరగా పూర్తవుతుంది.

కొబ్బరి పాలు వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు ఉడికించకుండా, నూనె పైకి తేలగానే దించేస్తే రుచి తాజాగా ఉంటుంది.

ఫ్లేవర్ కోసం కరివేపాకును మసాలా పొడిలోనూ, అలాగే పోపులోనూ వాడటం వల్ల మంచి సువాసన వస్తుంది.