
నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం. ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ వండే ముందు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం..”చికెన్ స్కిన్ ఉంచాలా? తీసేయాలా?” చాలామంది స్కిన్ ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు. అందుకే ఎక్కువగా స్కిన్ లెస్ చికెన్ తింటారు. మరికొందరు మాత్రం రుచి కోసం దానిని ఇష్టపడతారు. అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాహార నిపుణుల విశ్లేషణ ప్రకారం.. చికెన్ చర్మంలో మూడింట రెండు వంతులు కొవ్వు ఉంటుంది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కొవ్వులో ఎక్కువ భాగం అసంతృప్త కొవ్వు. ఇది గుండెకు మేలు చేసే ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చికెన్‌ను చర్మంతో కలిపి ఉడికించడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఉడికించే సమయంలో చర్మంలోని సహజ సిద్ధమైన నూనెలు మాంసంలోకి చేరి, చికెన్ గట్టిపడకుండా మృదువుగా ఉండేలా చేస్తాయి. చికెన్‌ను స్కిన్‌తో కలిపి వండి.. తినే సమయంలో ఆ చర్మాన్ని తొలగించడం ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల రుచికి రుచి దక్కుతుంది. అనవసరమైన కొవ్వు కూడా శరీరంలోకి చేరదు.
చికెన్ చర్మం ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేసినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం దానిని పూర్తిగా నివారించడం మంచిది..
బరువు తగ్గాలనుకునేవారు: అదనపు కేలరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
గుండె జబ్బులు ఉన్నవారు: రక్తనాళాల్లో పూడికలు వచ్చే ప్రమాదం ఉన్నవారు స్కిన్‌కు దూరంగా ఉండాలి.
మధుమేహం: షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండాలంటే లీన్ ప్రోటీన్ తీసుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్: రక్తంలో కొవ్వు శాతం ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు చర్మం లేని చికెన్ తినడమే శ్రేయస్కరం.
జిమ్‌కు వెళ్లేవారు, కండరాలు పెంచాలనుకునే వారు కేవలం చికెన్ బ్రెస్ట్ తీసుకోవడం వల్ల అత్యధిక ప్రోటీన్ పొందుతారు. మొత్తం మీద మితంగా తింటే ఏ ఆహారమైనా ఆరోగ్యమే. కానీ మీ ఆరోగ్య స్థితిని బట్టి చర్మంతో తినాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..