Makar Sankranti 2022: సంక్రాంతి పండుగ రాబోతోంది. ఆ రోజు బెల్లం నువ్వులతో చేసిన లడ్డులు తినడం ఆనవాయితీ. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా ఈ లడ్డూలు చాలా మంచివి. చలికాలంలో బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో రక్తానికి లోటు ఉండదు. శారీరక బలహీనత తొలగిపోయి జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ లడ్డూలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వాటిని తయారు చేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. సులువుగా తయారుచేసుకోవచ్చు. అయితే ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
నువ్వుల లడ్డూలు తయారుచేయడానికి మీకు 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల నువ్వులు, రెండు చెంచాల బాదం, రెండు చెంచాల జీడిపప్పు, రెండు చెంచాల నెయ్యి, 4 నుంచి 5 యాలకులు అవసరం.
ఎలా తయరు చేయాలి..
1. ముందుగా నువ్వులను శుభ్రంగా కడిగి బాణలిలో వేసి మీడియం మంటపై వేయించాలి. లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలని గుర్తుంచుకోండి.
2. వాటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చండి. తరువాత సగం నువ్వులను వేరు చేసి వాటిని మిక్సీలో వేసి ముతకగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన నువ్వుల పేస్ట్‌ని మిగతా నువ్వులలో వేసి కలపాలి.
3. ఇప్పుడు ఒక పాన్‌లో టేబుల్ స్పూన్ వెన్నను వేడి చేయాలి. అది కరిగాక అందులో బెల్లం వేసి కరిగించాలి. తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పులను చిన్న ముక్కలుగా కోసి వేయాలి. యాలకుల పొడి కూడా వేయాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని నువ్వులలో వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని నిమ్మకాయ సైజులో గుండ్రని లడ్డూలను సిద్ధం చేయాలి.
5. అలా చేసిన తర్వాత వాటిని 4 నుంచి 5 గంటల పాటు ఆరనివ్వాలి. తరువాత ఇవి గట్టిపడుతాయి. అప్పుడు వాటిని గాలి చొరబడని కంటైనర్ పెట్టి నిల్వ చేయాలి. చాలా కాలం తాజాగా ఉంటాయి.