Capsicum Chicken Curry Recipe: క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఈసారి ఇలా చేయండి.. టేస్ట్ కిర్రాక్ ఉంటది..!

నాన్‌ వెజ్‌ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్సికమ్ చికెన్ కర్రీ రుచి, వాసనలో అదిరిపోతుంది. మసాలా ఘాటు, క్యాప్సికమ్ తీపి కలయికతో ఈ కూర వేడి అన్నంలో తినాలంటే దాని రుచి వేరే లెవెల్‌ లో ఉంటుంది. ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించదగిన స్పెషల్ రెసిపీ ఇది.

Capsicum Chicken Curry Recipe: క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఈసారి ఇలా చేయండి.. టేస్ట్ కిర్రాక్ ఉంటది..!
Capsicum Chicken Curry Recipe

Updated on: Jun 03, 2025 | 7:48 PM

క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెసిపీ.. వేడి వేడి అన్నానికి బెస్ట్ కాంబినేషన్. నాన్ వెజ్ వంటలు ఇష్టపడేవారి కోసమే ఈ రుచికరమైన క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెసిపీ. వేడి వేడి అన్నంతో ఈ కూర తింటే ఆ రుచే వేరు. ఇది మసాలా ఘాటు, క్యాప్సికమ్ తీపిదనం కలిపి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • పల్లీ నూనె – 1 కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర కప్పు
  • ఉల్లిపాయలు – 5 (పేస్ట్ చేసుకోవాలి)
  • జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు
  • ఎర్ర మిరపకాయల పేస్ట్ – 4 టీ స్పూన్లు
  • పసుపు – ½ టీ స్పూను
  • కారం – 1 టీ స్పూను
  • నెయ్యి – 2 టీ స్పూన్లు
  • నీళ్లు – 2+2 గ్లాసులు (మొత్తం 4 గ్లాసులు)
  • కొత్తిమీర – 1 కప్పు (పేస్ట్ కోసం) + కొద్దిగా (గార్నిష్ కోసం)
  • పచ్చి మిరపకాయలు – 4 (పేస్ట్ కోసం)
  • కోడి మాంసం – 1.5 కిలోలు (మధ్యస్థ ముక్కలు)
  • క్యాప్సికమ్ – 4 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • టమాటా – 1 (పొడవుగా కట్ చేసుకోవాలి)
  • పెరుగు – 1 కప్పు
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం

క్యాప్సికమ్ చికెన్ కర్రీ తయారీకి ముందుగా ఒక పెద్ద కడాయి లేదా పాన్‌ లో పల్లీల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసి మీడియమ్ మంటపై వేపి మూత పెట్టి ఉంచండి. అప్పటికి ఉల్లిపాయ పేస్ట్ నుండి నూనె విడిపోవడం గమనించవచ్చు.

ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఎర్ర మిరపకాయల పేస్ట్ వేసి మసాలాలు బాగా కలిసేలా కలుపుకోండి. ఒక చిన్న గిన్నెలో పసుపు, కారం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి కలుపుతూ వేయించాలి.

తర్వాత నెయ్యి వేసుకుంటే కూరకు మంచి వాసన, రుచి వస్తుంది. ఇక నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియమ్ మంటపై ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి అందులో పెరుగు వేసి బాగా కలపండి. మరొక బ్లెండర్‌ లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలను వేసి మెత్తని పేస్ట్ తయారు చేసి ఈ తాజాగా రుబ్బిన పేస్ట్‌ ను కర్రీలో వేసి తగినంత ఉప్పు కూడా కలిపి బాగా కలపాలి.

ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కోడి మాంసం ముక్కలను వేసి మీడియమ్ మంటపై ఉడికించండి. కొంత సమయం తర్వాత మూత తీసి చికెన్ ముక్కలను జాగ్రత్తగా తిప్పాలి.. అప్పుడు అన్ని వైపులా మసాలా పడుతుంది. ఇప్పుడు పొడవుగా కోసిన టమాటా ముక్కలు కలపాలి. మరోసారి నీళ్లు వేసి చికెన్ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపి మూతపెట్టి చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించండి.

చికెన్ బాగా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్లీ ఒకసారి కలిపి మూత పెట్టాలి. సుమారు 5 నిమిషాల పాటు క్యాప్సికమ్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత మిగిలిన కొత్తిమీరతో పై నుంచి చల్లి మూత పెట్టి వెంటనే గ్యాస్ ఆపేయండి. క్యాప్సికమ్ మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి. అప్పుడే దాని రుచి బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి క్యాప్సికమ్ చికెన్ కర్రీ వడ్డించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని వేడి అన్నం లేదా చపాతీతో ఆస్వాదించండి.