AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు తినరా మీరు.. వాటిని తలదన్నే ఒమేగా-3 ఇందులో..

మన ఇంటి దగ్గర పెరిగే గంగవల్లి కూర (పర్సలీన్) చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 కలిగి ఉంది. ఇది విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియంతో నిండి, కళ్ళకు, ఎముకలకు మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరమైన ఈ అడవి కూరను పప్పులో, పులుసులో వండుకోవచ్చు.

చేపలు తినరా మీరు.. వాటిని తలదన్నే ఒమేగా-3 ఇందులో..
Gangavalli
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2026 | 12:42 PM

Share

మన ఇంటి వద్ద, పొలాల గట్లపై, గ్రామాల్లో సాధారణంగా అడవి కూరలా పెరిగే గంగవల్లి కూరను చాలామంది పెద్దగా పట్టించుకోరు. అయితే ఆంగ్లంలో పర్సలీన్ (Purslane) అని పిలిచే ఈ చిన్న ఆకుకూరలో ఆశ్చర్యకరమైన పోషక విలువలు దాగి ఉన్నాయి.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, గంగవల్లి కూరలో చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల చేపలతో పోలిస్తే కూడా ఇందులో ఒమేగా-3 స్థాయిలు ఎక్కువగా ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, శరీరంలో వాపులను తగ్గించడంలో ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.

గంగవల్లి కూర కేవలం ఒమేగా-3తోనే ఆగిపోదు. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ కూర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం (ఫైబర్) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారంగా పరిగణిస్తారు.

అంతేకాకుండా, ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. గంగవల్లి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండటం వల్ల శరీర కణాలను రక్షించి వృద్ధాప్య ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో ఉపయోగపడతాయి. పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణకు కూడా తోడ్పడుతుంది.

ఈ పోషకాల గనిని పప్పులో, పులుసులో లేదా సాధారణ కూరగా వండుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇందులో ఆక్సలేట్లు కొంతమేర ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.

మన ఇంటి చుట్టూ కలుపు మొక్కలా కనిపించే ఈ చిన్న ఆకుకూర అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవి. అందుకే గంగవల్లి కూరను పోషకాల పవర్‌హౌస్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సులభంగా లభించే ఈ సహజ వరాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

(ఈ సమాచారం నిపుణులు నుంచి సేకరించాం. మీరు దీన్ని వినియోగించేముందు తగిన సంప్రదింపులు చేయడం ముఖ్యం)

Follow Us