Mutton Salt Curry: మటన్ తో ఎప్పుడూ ఒకే రకమైన కూరలా?.. ఈ ‘సాల్ట్ కర్రీ’ రుచి చూస్తే పాత వంటలన్నీ మర్చిపోవడం ఖాయం!

మాంసాహార ప్రియులకు మటన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఇష్టం. పెరిగిన ధరలను కూడా లెక్కచేయకుండా ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. అయితే, ప్రతిసారీ రెగ్యులర్ మసాలాలతో కాకుండా, ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే ఈ 'మటన్ సాల్ట్ కర్రీ' మీ కోసమే! తక్కువ మసాలాలు, ఎక్కువ రుచితో తయారయ్యే ఈ వంటకం వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్. కేవలం రుచికే కాదు, శరీరానికి అవసరమైన విటమిన్ బి12, ఐరన్ అందించడంలోనూ మటన్ మేటి. ఆ స్పెషల్ రెసిపీ రహస్యాలేంటో చూద్దాం..

Mutton Salt Curry: మటన్ తో ఎప్పుడూ ఒకే రకమైన కూరలా?.. ఈ సాల్ట్ కర్రీ రుచి చూస్తే పాత వంటలన్నీ మర్చిపోవడం ఖాయం!
Mutton Salt Curry Recipe

Updated on: Mar 06, 2026 | 8:56 PM

మటన్ బిర్యానీ అంటే అందరికీ ప్రాణం, కానీ ఇంట్లో చేసే మటన్ సాల్ట్ కర్రీ ఇచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా ముస్లిం పండుగల సమయంలో దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న ఉల్లిపాయలు, ఎండు మిరపకాయల ఘాటుతో తయారయ్యే ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కండరాల దృఢత్వానికి మటన్ ఎంతో తోడ్పడుతుంది.

కావలసిన పదార్థాలు:

మటన్ – అర కిలో

చిన్న ఉల్లిపాయలు – 30

ఎండు మిరపకాయలు – 20

వెల్లుల్లి రెబ్బలు – 20

టమోటా – సగం ముక్క

నువ్వుల నూనె – సరిపడా

పసుపు పొడి, ఉప్పు, కరివేపాకు.

తయారీ విధానం:

ముందుగా మటన్ ను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమోటా ముక్కలను సిద్ధంగా ఉంచుకోవాలి.

పాన్ లో నువ్వుల నూనె వేసి వేడయ్యాక.. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఇందులో కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆపై టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.

టమోటా గుజ్జులా మారాక మటన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా నీరు పోసి మూత పెట్టి మటన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

నీరంతా ఇంకిపోయి, మాంసం మెత్తగా వేగి పొడిగా మారాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే మటన్ సాల్ట్ కర్రీ రెడీ!

 

Follow Us