Mullangi Kofta Recipe: చికెన్ పకోడీ కూడా బలాదూర్! ముల్లంగితో కోఫ్తా గ్రేవీ.. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు!

ముల్లంగి పేరు చెబితేనే చాలా మంది ముక్కు ముడుస్తుంటారు. దాని ప్రత్యేకమైన వాసన వల్ల సాంబారులో వేసినా తినడానికి పిల్లలు, పెద్దలు ఇష్టపడరు. అయితే, ముల్లంగితో మనం చేసే ఈ 'కోలా బాల్స్' లేదా 'కోఫ్తా గ్రేవీ' రుచి చూస్తే.. అసలు ఇది ముల్లంగితోనే చేశారా? అని ఆశ్చర్యపోతారు. కరకరలాడే బాల్స్ స్పైసీ గ్రేవీ కలయిక మీ భోజనానికి ఒక కొత్త రుచిని అద్ది, ముల్లంగి పట్ల మీకున్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది.

Mullangi Kofta Recipe: చికెన్ పకోడీ కూడా బలాదూర్! ముల్లంగితో కోఫ్తా గ్రేవీ.. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు!
Mullangi Kofta Recipe

Updated on: Jan 29, 2026 | 5:58 PM

ఈ వంటకంలో ముల్లంగిలోని నీటిని పూర్తిగా పిండేయడం వల్ల దాని వాసన అస్సలు తెలియదు. శనగపిండి మసాలాల కలయికతో చేసే ఈ బాల్స్‌ను గ్రేవీలో వేసి వండితే, అది ఒక రాయల్ వంటకంలా తయారవుతుంది. వేడివేడి అన్నం లేదా రోటీల్లోకి ఇది అద్భుతమైన సైడ్ డిష్‌గా మారుతుంది. తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రెస్టారెంట్ స్టైల్ ముల్లంగి కోఫ్తా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.

కావలసిన పదార్థాలు:

కోలా బాల్స్ కోసం:

ముల్లంగి (2),

శనగపిండి (1/2 కప్పు),

చిన్న ఉల్లిపాయలు (10),

సోంపు (1 స్పూన్),

ఎండు మిర్చి (3),

అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 స్పూన్),

కరివేపాకు, ఉప్పు,

నూనె.

గ్రేవీ కోసం: చిన్న ఉల్లిపాయలు (15), టమోటా (2), వెల్లుల్లి (10 రెబ్బలు), చింతపండు (నిమ్మకాయ సైజు), కారం, ధనియాల పొడి, పసుపు, కొబ్బరి పేస్ట్ (1/4 కప్పు), తాలింపు గింజలు.

తయారీ విధానం :

ముల్లంగిని తొక్క తీసి తురుముకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆ తురుమును ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండి నీటిని పూర్తిగా తీసేయాలి. లేదంటే బాల్స్ నూనె పీల్చేస్తాయి.

పిండిన ముల్లంగిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు-ఎండుమిర్చి పొడి, ఉప్పు బైండింగ్ కోసం శనగపిండి వేసి ముద్దలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వేడి నూనెలో బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

పాన్‌లో నూనె వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు, మసాలా పొడులు వేసి మగ్గనివ్వాలి.

చింతపండు రసం, ఉప్పు కొబ్బరి పేస్ట్ వేసి గ్రేవీని బాగా మరిగించాలి. గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత, వేయించిన కోలా బాల్స్ వేసి 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి. (బాల్స్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు).