ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తెప్పించే మాడుగుల హల్వా ఎలా తయారు చేస్తారో తెల్సా..
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది.
మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ ప్రస్థానం మొదలైనట్లు చెబుతారు. ఏకంగా 20 దేశాలకు పైగా ఈ హల్వా ఎగమతి అవుతుందంటే మాటలా చెప్పండి. సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్ చాలామంది ఈ మాడుగుల హల్వాను ఇష్టంగా తింటారు. మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు అనే వ్యక్తి సుమారు 140 ఏళ్ల కిందట అదే గ్రామంలో మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో ఆయన కొబ్బరి, ఖర్బూజ, బూడిద గుమ్మడిలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. అయితే పోటీ పెరగడంతో.. కొత్త స్వీట్ ఏమైనా తయారు చేయాలనుకున్నారు. అలా ఈ స్పెషల్ మాడుగుల హల్వాను కనిపెట్టారు.
మాడుగుల హల్వాను తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న ప్రచారం ఉంది. అందుకే చాలామంది ఫస్ట్ నైట్ కోసం దీన్ని స్పెషల్‌గా ఆర్డరిస్తారు. అలాగే బాలింతలకు శక్తి కోసం కూడా మాడుగుల హల్వా ఇస్తారు. సరిగ్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడమే.. ఈ హల్వా చేయడంతో ప్రధాన టాస్క్. కనీసం 15, 20 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లే కళాయి దగ్గర ఉంటారు. మాడుగుల హల్వా తయారు చేయడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పడుతుందట. ముందుగా గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు సేకరిస్తారు. వాటిని ఒక రోజు పులియబెట్టి… వాటికి పంచదార, ఆవు నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై జీడిపప్పు, బాదం పప్పు వేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మాడుగుల హల్వా తయారుచేసే విధానం ఇదే. అయితే కట్టెల పొయ్యి మీదే పాకం పడతారు. ఇలా చేసిన హల్వా నెల రోజుల వరకు మన్నిక ఉంటుంది.
ఈ హల్వా ఖరీదు కేజీ రూ. 400 నుంచి రూ.600 వరకూ ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు సైతం తరలి వెళ్తుంది ఈ హల్వా. కల్తీ లేని మాడుగుల హల్వా మితంగా తింటే ఆరోగ్యానికి, శారీరక శక్తికి దోహదపడే అవకాశం ఉందని.. న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం హల్వా వ్యాపారాన్ని నమ్ముకుని 1500 కుటుంబాలు మాడుగులలో జీవిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..