నువ్వుండలు లేదా నువ్వుల లడ్డూల గురించి తెలియని వారుండరు. ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ లడ్డూలకు మకర సంక్రాంతి లేదా లోహ్రి వంటి పలు పర్వదినాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేటికీ భారతదేశంలోని చాలా ఇళ్లలో ప్రజలు పండుగ సందర్భంగా నువ్వుల లడ్డూలను సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి తింటారు. ఇంకా చెప్పుకోవాలంటే నువ్వులతో చేసిన లడ్డూలను తినడం చాలా మందికి ఉన్న ఆహారపు అలవాట్లలో అంతర్భాగం. ముఖ్యంగా చలికాలంలోనే వచ్చే సంక్రాంతి పండుగ నాడు లేదా చలికాలంలో నువ్వుల లడ్డూలను తినడం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ అజయ్ కుమార్ అందిస్తున్నసూచనల ప్రకారం నువ్వులు, బెల్లంతో తయారుచేసిన లడ్డూలు చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి నయం చేయడమే కాకుండా, నువ్వుల నుంచి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వులలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరంలో అంతర్భాగాలైన కళ్ళు, కాలేయం, ఇతర ప్రధాన అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. నువ్వులు మెరుగైన సూపర్ ఫుడ్. ఈ కారణంగానే ప్రజలు దాని నుంచి నూనెను తీసిన తర్వాత కూడా తింటారు. అదే సమయంలో నువ్వుల లడ్డూల కోసం వాడే బెల్లం మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి, బెల్లం వాటిని తెరిచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గేవారు దీనిని తీసుకోవచ్చు.