Potatoes Side Effects: మొలకెత్తిన బంగాళదుంపలను తింటున్నారా.? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి.!

అత్యధిక పోషకాలున్న కూరగాయాల్లో బంగాళదుంప కూడా ఒకటి. ఇది ప్రతీ ఒక్కరి వంటింట్లోనూ ఉంటుంది. లంచ్ లేదా డిన్నర్...

Potatoes Side Effects: మొలకెత్తిన బంగాళదుంపలను తింటున్నారా.? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి.!
Potatoes

Updated on: Jan 19, 2022 | 7:40 PM

అత్యధిక పోషకాలున్న కూరగాయాల్లో బంగాళదుంప కూడా ఒకటి. ఇది ప్రతీ ఒక్కరి వంటింట్లోనూ ఉంటుంది. లంచ్ లేదా డిన్నర్ ఏదైనా కూడా కొంతమందికి బంగాళదుంపతో కర్రీ లేదా డిఫరెంట్ వంటకాలు తయారు చేసుకోకపోతే ముద్దదిగదు. బంగాళదుంపను కర్రీకి మాత్రమే కాదు సాంబార్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన బంగాళదుంపలకు రెండు రోజుల తర్వాత మొలకులు రావడం ప్రారంభమవుతాయి. ఇలా రావడాన్ని మీరు గుర్తించే ఉంటారు. అలా వచ్చినా కూడా చాలామంది వాటితో కూర వండేస్తారు. అయితే మొలకెత్తిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి ప్రయోజనకరమా.? లేదా హానికరమా.? అనేది మీరెప్పుడైనా ఆలోచించారా.! దీనిపై అమెరికాకు చెందిన నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్(National Capital Poison Center) ఏం చెబుతోందంటే.. మీ ఇంట్లో ఉంచిన బంగాళదుంపలు మొలకెత్తినా లేక మొలకెత్తిన బంగాళదుంపలు ఉన్నా.. వాటిని వెంటనే బయట పారేయాలని సూచిస్తోంది. అలాంటి బంగాళదుంపలు ఆరోగ్యానికి హానికరమని అని చెబుతోంది.

మొలకెత్తిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం.? వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి.?

నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ నివేదిక ప్రకారం.. బంగాళదుంపల్లో సహజంగా సోలనిన్, చాకోనిన్ లాంటి విష పదార్ధాలు ఉంటాయి. ఇవి వాటిల్లో తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ.. దాని మొక్క, ఆకులలో ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బంగాళదుంప మొలకెత్తడం ప్రారంభమైతే.. ఆ రెండిటి పరిమాణం కూడా పెరుగుతూపోతుంది. ఒకటి లేదా రెండుసార్లు మీరు మొలకెత్తిన బంగాళదుంపలను తింటే ఫర్వాలేదు గానీ.. నిత్యం అలాంటి వాటినే తింటూ ఉంటే మాత్రం కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయని నివేదిక పేర్కొంటోంది.

ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు..

బంగాళదుంపలలోని విషపూరిత పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించినట్లయితే.. మీకు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి లక్షణాలు వస్తాయి. కొంతమందిలో ఈ లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. కొందరిలో ఇవి తీవ్రంగా ఉంటాయి. పరిస్థితి మరింత తీవ్రమైతే లో-బీపీ, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సరైన సమయంలో అప్రమత్తం కాకపోతే మరణం కూడా సంభవించవచ్చు.

బంగాళాదుంపలు మొలకెత్తకుండా ఎలా ఆపాలి:

1. బంగాళాదుంపలు ఆకుపచ్చ రంగులో కనిపించినా, మొలకెత్తినా.. ఆ పార్ట్ వరకు తీసేయండి.

2. బంగాళదుంపలను ఎప్పుడూ చల్లని ప్రదేశంలో ఉంచండి.

3. బంగాళదుంపలను నిల్వ చేసేటప్పుడు ఉల్లిపాయలను దగ్గరలో ఉంచొద్దు.

4. ఒకవేళ మీరు బంగాళాదుంపలను ఎక్కువగా కొన్నట్లయితే.. వాటిని ఓ కాటన్ బ్యాగ్‌లో ఉంచండి. లోపలికి గాలి వెళ్ళేలా ఉండాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి