
నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను ఇష్టంగా తింటారు.. వాస్తవానికి మాంసాహార వంటకాలలో చికెన్ మొదటి స్థానంలో ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహారం ఇదే. కొంతమందికి ప్రతిరోజూ చికెన్ లేకపోతే భోజనం పూర్తి అయినట్టు అనిపించదు.. అలాంటి వారికి ముక్కలేకుండా ముద్ద దిగదు.. మరికొందరు వారానికి రెండు, మూడు రోజులైన చికెన్ ను తింటారు. చికెన్ ఫ్రై, కర్రీ, బిర్యానీ, చికెన్ 65 వంటి అనేక రకాల వంటకాలను చేసుకుని.. లేదా హోటల్ నుంచి తెప్పించుకుని ఇష్టంగా ఆరగిస్తారు.. అయితే, ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది మంచిదా, లేక మితిమీరితే ఏమైనా సమస్యలు వస్తాయా? నిపుణుల అభిప్రాయాలేంటి..? అనే వివరాలను ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం..
వాస్తవానికి చికెన్ లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. చికెన్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలలో ఒకటి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించగలదు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చికెన్ తినడం శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు.
సోడియం స్థాయిలు, అధిక రక్తపోటు: రోజువారీ చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇది అధిక రక్తపోటు సమస్యలకు దారితీయవచ్చు. 2017 సంవత్సరంలో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజు అధికంగా చికెన్ తినేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది.
ఎముకల దృఢత్వంపై ప్రభావం: ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం: కొన్ని అధ్యయనాల ప్రకారం, చికెన్ మాంసంలో ఉండే కొన్ని రసాయనాలు పెద్ద పేగు క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
గుండె జబ్బుల ప్రమాదం: మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ప్రత్యేకించి, ప్రతిరోజూ అధికంగా చికెన్ తినడం వల్ల ఎల్డీఎల్ (LDL) అనే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెకు సంబంధించిన అనేక రోగాలకు దారితీస్తుంది.
శరీర ఉష్ణం, జీర్ణ సమస్యలు: చికెన్ తినడం వల్ల శరీరంలో అధిక వేడి ఏర్పడుతుంది. దీని కారణంగా మలబద్ధకం, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బరువు పెరుగుదల: చికెన్‌లో కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీన్ని అధికంగా తినటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల ప్రమాదం: తక్కువ నాణ్యత కలిగిన చికెన్ తింటే హానికరమైన బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. కొన్నిసార్లు సరిగ్గా ఉడకని చికెన్ తినడం వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ప్రతిరోజూ చికెన్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బదులుగా, ఒక సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవడం ఉత్తమం. నిపుణులు వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చికెన్ తినాలని సూచిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం, రోజుకు 50 గ్రాముల కన్నా ఎక్కువగా చికెన్ తినకూడదు. అదేగాక, నాణ్యమైన చికెన్ తీసుకోవడం, దానిని పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలను తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..