2030 నాటికి భారతీయులు తమ వంట గదులకు తాళాలేస్తారా? మూడు పూట్లా హోటళ్లలోనే తింటారా?

|

Jul 23, 2024 | 9:49 AM

తాజాగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ఓ నివేదికను విడుదల చేసింది. అది రెస్టారెంట్స్ అసోసియేషన్ కనుక.. కేవలం రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందించింది. ఆ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న మొత్తం రెస్టారెంట్ల సంఖ్య అక్షరాల 74వేల 807. ఇందులో వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసినవి 41వేల144. ఇవి కాకుండా నగరంలో 16వేల 379 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి. వీటితో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు 13 వేల 544, అలాగే క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు మరో 6వేల468 ఉన్నాయి.

2030 నాటికి భారతీయులు తమ వంట గదులకు తాళాలేస్తారా? మూడు పూట్లా హోటళ్లలోనే తింటారా?
ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్‌పైనే మక్కువ
Follow us on

2023లో ప్రతి సెకెన్‌కి సుమారు 2 నుంచి 3 బిర్యానీలు ఇండియా ఆర్డర్ చేసిందంటూ స్వీగ్గీ  తన వార్షిక నివేదికలో వెల్లడించింది.  అది చూసిన తర్వాత.. అబ్బో ఇండియాలో బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారనుకున్నాం. అయినా దేశ వ్యాప్తంగా ఏటా బిర్యానీ మార్కెట్ దాదాపు 20 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్న వార్తలొచ్చినప్పుడు సెకెన్‌కి 2 నుంచి 3 బిర్యానీలు ఆర్డర్ చెయ్యడం సర్వ సాధారణం. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు.

ఇది మరో వార్త.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ మార్కెట్ ఏకంగా 45శాతం పెరిగిందట. ఇక మరో ఆన్ లైన్ ఫుడ్ దిగ్గజం జొమాటో విషయానికి వస్తే 2024 తొలి త్రైమాసికంలో ఏకంగా 175 కోట్ల లాభం కళ్ల జూసింది. స్విగ్గీ-జొమాటో.. రెండూ ఇండియాలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు.

ఇప్పుడు మీకు ఇంకో విషయం చెబుతా… 2030 నాటికి ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ ఏకంగా 2లక్షల కోట్లకు చేరుతుందట. ఇది తాజాగా బెయిన్ మరియు స్విగ్గీ సంస్థలు వెల్లడించిన రిపోర్ట్.

పైన చెప్పిన మూడు విషయాలను బట్టీ మనకు ఏం అర్థమవుతోంది..? ఇండియన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్… భవిష్యత్ అద్భుతంగా ఉండబోతోందనా…? వాళ్లు అవకాశం ఇస్తే… మనం కూడా వీలైతే అందులో పెట్టుబడులు పెడితే.. కళ్లు చెదిరే లాభాలు చూరగొనచ్చనా..? లేదా.. భారతీయులు వంట చెయ్యడం మానేసి… వంటిళ్లకు తాళాలేస్తారనా..? కేవలం ఊరు మీద పడి మాత్రమే తింటారనా..?

ఎటు చూసినా హోటళ్లే!

అన్నింటికన్నా చివరి చెప్పిన విషయం గురించి మీరు…నేను అనుకోవాల్సినవసరం లేదు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెరిగిపోతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు.. అంటీలు పెట్టే పూటకూళ్ల బళ్లు నిదర్శనం. పది ఇళ్లున్న వీధిల్లో రెండు టిఫిన్‌బళ్లు సిద్ధంగా ఉంటే.. ఆ రెండూ కూడా ఎప్పుడు ఖాళీలేని పరిస్థితులు వచ్చేశాయి. అంతెందుకు ఎప్పుడో కానీ వార్తల్లోకి రాని ఫుడ్ ఇన్సెక్టర్లు… ఇప్పుడు తరచు టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాల్లో కనిపిస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల వారికి ఆగ్రహం రావచ్చేమో కానీ.. ఉన్న వాస్తవం ఇది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇప్పుడు వాళ్లకు క్షణం తీరిక ఉండటం లేదు. ఈ మధ్య కాలంలో తరచు హోటళ్లు, రెస్టారెంట్లలో జరుగుతున్న తనిఖీలే అందుకు నిదర్శనం. సరే.. వారి తనిఖీల్లో హోటళ్ల తీరు ఎలా ఉంది..? పేరున్న రెస్టారెంట్లు.. మసక మసక చీకట్లలో… కనీ కనిపించని కొవ్వొత్తుల వెలుగుల్లో…వందలు, వేలు వసూలు చేస్తూ ఏం వడ్డిస్తున్నారో బట్టబయలయ్యింది కూడా. సరే.. అంతకు మించి.. హోటళ్లలో ఆహారం నాణ్యత గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు. వాటి గురించి మరో సందర్భంలో చెప్పుకుందాం.

హైదరాబాద్‌లో 74,807 రెస్టారెంట్లు

తాజాగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ఓ నివేదికను విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న మొత్తం రెస్టారెంట్ల సంఖ్య అక్షరాల 74వేల 807. ఇందులో వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసినవి 41వేల144. ఇవి కాకుండా నగరంలో 16వేల 379 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి. వీటితో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు 13 వేల 544, అలాగే క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు మరో 6వేల468 ఉన్నాయి.

ఇదీ…హైదరాబాద్ లెక్క!

ఈ సర్వేలో చాలా విషయాలు బయటపడ్డాయి. సగటున ఒక్కో హైదరాబాదీ.. నెలలలో ఒక్కొక్కరూ కనీసం 6 సార్లు బయటే తింటూ ఉంటే ఫ్యామెలీతో కలిసి కనీసం 3 నుంచి 4సార్లు తింటున్నారట. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఇది కాస్త తక్కువే అయినా.. తిండి కోసం పెట్టే ఖర్చు విషయంలో మాత్రం మిగిలిన చాలా రాష్ట్రాల కన్నా మనమే ముందుంటున్నాం. హైదరాబాద్‌లో ఒక్కో వ్యక్తి సగటున నెలకు 997 రూపాయలు బయట ఫుడ్‌ కోసం ఖర్చు పెడుతున్నారు. అదే నేషనల్ యావరేజ్ చూస్తే 970 రూపాయులుగా ఉంది.

నిజానికి కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత అన్నింటికన్నా బాగా దెబ్బతిన్నది ఫుడ్ ఇండస్ట్రీనే. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మాత్రం పుడ్ ఇండస్ట్రీలో అనుహ్యపరిణామాలు సంభవించాయి. వృద్ధి రేటులో ఒక్కసారిగా భారీ జంప్ కనిపించింది. ప్రస్తుతం ఇదే స్థాయిలో ముందుకెళ్తే 2028 నాటికి ఏడాదికి 12 శాతం వృద్ధి రేటుతో ఫుడ్ ఇండస్ట్రీ పరుగులు పెడుతుందన్నది నిపుణుల అంచనా.

5.69 లక్షల కోట్ల మార్కెట్!

ఇక దేశ వ్యాప్తంగా చూస్తే ఈ ఫుడ్ బిజినెస్ విలువ సుమారు 5 లక్షల 69 వేల 487 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అదే 2028 నాటికి 7 లక్షల76 వేల 511 కోట్లు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద వృద్ధి రేటు 8.1 శాతం ఉంటుందని అంచనా వేస్తుండగా, కేవలం వ్యవస్థీకృతమైన ఫుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ అంచనా 13.2గా ఉండొచ్చని భావిస్తున్నారు.

కోవిడ్-19 తర్వాత భారత ఆహార పరిశ్రమలో వృద్ధి రేటు ఊహించని వేగంతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ రంగం నేరుగా 85.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఖజానాకు 33 వేల 809 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తోంది. అని NRAI ప్రెసిడెంట్ కబీర్ సూరీ వ్యాఖ్యానించారు.

బిర్యానీ ది బెస్ట్!

గడిచిన ఐదేళ్లలో ఫుడ్ ఇండస్ట్రీ విషయంలో చెప్పుకోదగ్గ మార్పులు జరుగుతూ వచ్చాయి. చిన్న చిన్న పట్టణాల్లోనూ ఫుడ్ డెలివరీ అందుబాటులోకి వచ్చింది. అది ఓ రకంగా ఇళ్లల్లో వంట చేసుకోవడం అన్న పనిని తగ్గిస్తూ వస్తోంది. అలా మిగిలిన సమయాన్ని మరింత ఆదాయం సంపాదించేందుకు వినియోగిస్తున్నారు. దానికి తోడు ఫుడ్ డెలివరీ పేరుతో ప్రధాన పట్టణాలకు వలస వచ్చే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. అటు రెస్టారెంట్లు, హోటళ్లకు కూడా భారీ ఎత్తున ఆదాయం వస్తోంది. దీన్ని త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇండస్ట్రీని గుర్తించి.. సానుకూల నిర్ణయాలు తీసుకుంటాని ఆశిస్తున్నా. అని NRAI స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ నితిన్ సలుజూ వ్యాఖ్యానించారు.

ముంబై నెంబర్ 1
ఇక NRAI విడుదల చేసిన తాజా గణాంకాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ముంబై ఉంది. మొత్తంగా 55వేల 181 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. ముంబైలో 56 శాతం మంది ఇటాలియన్ ఫుడ్‌పై మోజు చూపిస్తున్నారు. 46 శాతం మంది చైనీస్, 43 శాతం మంది సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మక్కువ చూపుతున్నారు. సుమారు 70శాతం మంది ముంబై వాసులు లేట్ ఈవినింగ్ డిన్నర్లకి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తాజా నివేదిక చెబుతోంది. కోవిడ్ తర్వాత బయటకి వెళ్లి తినే అలవాటు బాగా పెరిగిందని 30 శాతం మంది ముంబై వాసులు చెబుతున్నారు.

జిహ్వకో రుచి

ఇక ఢిల్లీ విషయానికొస్తే ఫుడ్ సెక్టార్లో అక్కడ ఏటా సుమారు 42 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఢిల్లీ వాసులు వేడుకల పేరుతో, సినిమాల పేరుతో తరచు బయట తింటూ ఉంటారట. నెలలో కనీసం 7 నుంచి 8 సార్లు రెస్టారెంట్లకు వెళ్లడం వారికి సర్వ సాధారణం. వీకెండ్స్‌లో ఆన్ లైన్ ఆర్డర్లు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడిన తర్వాత సుమారు 32 శాతం ఢిల్లీ వాసులు బయట ఫుడ్‌ తరచు తీసుకోవడం చేస్తున్నారు. ఢిల్లీ జనం ఎక్కువగా సమోసా, కచోరీలు, పకోడీ, ఛోలే బఠోరా, కబాబ్స్ అంటే మక్కువ చూపుతున్నారు. అలాగై సౌత్ ఇండియన్ ఇడ్లీ-వడ కూడా ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు.

ముంబై నెంబర్ 1

మూడో స్థానంలో కర్నాటక రాజధాని బెంగళూరు ఉంది. NRAI IFSR 2024 నివేదిక ప్రకారం ఇక్కడ ఏటా 26వేల 475 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టార్లు కలిపి మొత్తంగా లక్ష 10వేల 140 రెస్టారెంట్లు ఉన్నాయి. పబ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే బెంగళూరులో మెజార్టీ జనం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల వైపు మక్కువ చూపుతారట.

నాల్గో స్థానం చెన్నైది. ఇక్కడ ఏటా సుమారు 15వేల 600 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. కనీసం నెలలో 4-5 సార్లు బయటే తినడానికి ఇష్టబడతారట తమిళ తంబీలు. నెలకు సరాసరి ఒక్కొక్కరూ 825 రూపాయలు రెస్టారెంట్లు, హోటళ్లలో తినేందుకు ఖర్చు పెడతున్నారన్నటి NRAI రిపోర్ట్ సారాంశం.

హైదరాబాద్‌లో ఏటా రూ.10,161 కోట్ల వ్యాపారం

అదే హైదరాబాద్ చూస్తే.. ఏటా 10వేల 161 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. హైదరాబాదీ జనం ఎక్కువగా ఫ్యామెలీలతో పాటు కలిసి రెస్టారెంట్లకు వెళ్లి తినాలని కనీసం 50 శాతం ఎక్కువ మంది భావిస్తుంటారని నివేదిక వెల్లడించింది. అలాగే 57 శాతం మంది తమ రొమాంటింక్ పార్టనర్‌తో కలిసి వెళ్లాలని కూడా భావిస్తున్నారట.

హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తుండటం, ఎక్కడికక్కడ ఫుడ్ బిజినెస్ విస్తరించడం, యువత ఎక్కువగా ఈ బిజినెస్ వైపు వస్తూ ఉండటం కూడా నగరంలో శరవేగంగా ఈ వ్యాపారం విస్తరించడానికి కారణం అని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సంపత్ తుమ్మల అన్నారు .

“రెస్టారెంట్ ఇండస్ట్రీ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ చాప్టర్‌ గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాం.నగరం నలుమూలలా విస్తరించడంతో ఏ పాకెట్‌కు ఆ పాకెట్‌లో ఉండే కస్టమర్ బిహేవియర్ ఏంటి? కస్టమర్ ఏజ్ గ్రూప్ ఏంటి… కస్టమర్ ఛాయిస్ఏంటి..? ఇటువంటి విషయాలపై సర్వే నిర్వహించాం. దేశంలో రెస్టారెంట్ల బిజినెస్ ఇండియన్ సినిమా కన్నా 33 రెట్లు పెద్దది. అంతే కాదు.. నిర్మాణం, వ్యవసాయం తర్వాత నాల్గో స్థానంలో ఈ రంగం ఉంది. ఇదే విషయాన్ని మేం ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. తద్వారా ఈ ఇండస్ట్రీకి తగిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతాం. ”

వీగన్ క్యాపిటల్ కూడా

హైదరాబాద్ ఇప్పుడు దేశానికి వీగన్ క్యాపిటల్ కూడా. దేశంలోనే అత్యధిక సంఖ్యలో వీగన్ రెస్టారెంట్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.తొలిసారిగా నగరంలో వీగన్ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరిగింది. వీగన్ ప్రియులకోసం శాకాహార మాంసం (Plant based meat) కూడా ఇక్కడ దొరుకుతోంది. అంతే కాదు.. కేవలం వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ల కోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా వండి వడ్డించే రెస్టారెంట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. అందుకే హైదరాబాద్ మోస్ట్ వీగన్ ఫ్రెండ్లీ సిటీ కూడా.

ప్రస్తుతం దేశంలో ఫుడ్ మార్కెట్ వల్ల సుమారు 85 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 2028 నాటికి కనీసం కోటి మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నది NRAI అంచనా.