Saggubiyyam Vadiyalu: వేసవి వచ్చిందంటే చాలు.. తెలుగువారి లోగిళ్ళలో పచ్చళ్ళు, వడియాల సందడి మొదలవుతుంది. ఏడాదికి ఉపయోగపడేలా ఊరగాయలు వడియాలు పెట్టుకుంటారు. ఈరోజు ఆంధ్ర స్పెషల్ సగ్గుబియ్యం వడియాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!
సగ్గు బియ్యం ఎం(లావు సగ్గుబియ్యం) – నాలుగు గ్లాసులు
పచ్చి మిరపకాయలు – 15
జీలకర్ర – ముప్పావు స్పూను.
ఉప్పు – రుచికి తగినంత.
కాచి చల్లార్చిన పాలు – ఒక అర గ్లాసు.
సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి.. ఒక గిన్నెలో ఆ సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ కొలత ప్రకారం పోసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. మర్నాడు ఉదయమే.. ఏ కొలత ప్రకారం సగ్గుబియ్యం వేసుకున్నామో.. ఆ గ్లాస్ తీసుకుని.. ఒక గిన్నెలో ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసుల చొప్పున నీరు పోసుకోవాలి. ఆ నీటిని గ్యాస్ స్టౌ మీద పెట్టి.. వేడి చేయాలి. ఇంతలో పచ్చి మిర్చి , ఉప్పు, జీలకర్ర వేసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
నీరు బాగా మరిగించిన తర్వాత పచ్చి మిర్చి పేస్ట్ ను వేసుకుని గరిటతో బాగా కలపాలి. వెంటనే నానబెట్టిన సగ్గు బియ్యం ను కూడా వేసుకుని మంటను మీడియం సెగలో పెట్టుకుని సగ్గు బియ్యం గింజలు బాగా ఉడికించాలి. అలా సగ్గుబియ్యం గింజలు బాగా లావయ్యి బాగా దగ్గర పడి పారదర్శకంగా అంటే గింజలు transparent గా అయ్యే వరకు దగ్గరే ఉండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా గరిటెతో బాగా కలుపుతుండాలి. సగ్గుబియ్యము బాగా ఉడికి దగ్గర పడ్డాక ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన చిక్కని పాలు అందులో పోసి గరిటెతో బాగా కలిపి దింపు కోవాలి.
ఇలా పాలు పోస్తే సగ్గు బియ్యం వడియం వేగిన తర్వాత మల్లెపూవులా తెల్లగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత దానిని ఒక పది నిముషాలు చల్లారనివ్వాలి.
కొద్దిగా చల్లారిన తర్వాత ఎండలో కాటన్ బట్టపై ఒక గరిటెతో కాచిన సగ్గుబియ్యాన్ని గుండ్రముగా వడియాలు వీలయినంత పల్చగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలు ఎండలో రోజూ పెట్టుకోవాలి. అవి వాటంతటఅవే ఊడివస్తాయి. అప్పుడు వాటిని తీసి గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలకు నీరు తగలక పొతే.. ఏడాది పాటు నిల్వ ఉంటాయి.
అవసరమైనప్పుడు కాసిని వడియాలు తీసుకుని నూనెలో వేయించుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడియాలను భోజనములోకి పక్కన ఆదరువుగానే కాదు.. మధ్యాహ్నం స్నాక్స్ గా కూడా తినవచ్చు.
Also Read: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..