
మారిన వాతావరణం వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ డైట్‌లో వెల్లుల్లి చట్నీని చేర్చుకోండి. వెల్లుల్లిలో ఉండే సహజ సిద్ధమైన ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, శరీరానికి వేడిని అందిస్తాయి. వేడివేడి దోసె మీద నువ్వుల నూనె, వెల్లుల్లి చట్నీ వేసుకుని తింటే వచ్చే ఆ కమ్మని రుచి మరే చట్నీలోనూ దొరకదు. పక్కా ట్రెడిషనల్ స్టైల్‌లో, అదిరిపోయే రుచితో ఈ చట్నీని మీరు కూడా ఈరోజే ఇంట్లో ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
చిన్న ఉల్లిపాయలు – పావు కిలో
తరిగిన వెల్లుల్లి – అర కప్పు
ఎండు మిరపకాయలు – 15 నుండి 20
చింతపండు – చిన్న ఉసిరి కాయ సైజు
నువ్వుల నూనె – అవసరమైనంత
ఆవాలు, మినపప్పు – తాలింపుకు
కరివేపాకు – ఒక కట్ట
రాతి ఉప్పు – తగినంత
తయారీ విధానం
ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి పావు కిలో చిన్న ఉల్లిపాయలు, అర కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
అందులోనే చిన్న ఉసిరి కాయ సైజు చింతపండు, కారానికి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లబడిన తర్వాత తగినంత రాతి ఉప్పు వేసి, మిక్సీలో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
చివరగా చట్నీకి కమ్మని తాలింపు ఇవ్వడం కోసం ఒక పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోసి వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ తాలింపును చట్నీలో కలిపితే అద్భుతమైన సువాసనతో కూడిన వెల్లుల్లి చట్నీ సిద్ధమవుతుంది. ఇది ఇడ్లీ, దోసెల్లోకే కాకుండా వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.