ముత్తాతలు అంత బలంగా ఉండటానికి కారణం ఇదే.. ప్రకృతి ప్రసాదించిన ఈ బువ్వతో రోగాలే ఉండవు..

మన పూర్వీకులు ఆహారంలో భాగంగా తీసుకున్న కొర్రలు నేటి తరానికి సూపర్‌ఫుడ్‌గా మారుతున్నాయి. అధిక పీచుపదార్థం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, జీర్ణవ్యవస్థకు మేలు చేసే గుణాలు కలిగిన కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు, బరువు నియంత్రణలో సహాయపడతాయి. తక్కువ నీటితో పండే ఈ పంట పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి కొర్రలు ఉత్తమ ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు.

ముత్తాతలు అంత బలంగా ఉండటానికి కారణం ఇదే.. ప్రకృతి ప్రసాదించిన ఈ బువ్వతో రోగాలే ఉండవు..
Korralu Benefits

Updated on: Jul 09, 2026 | 7:44 PM

కొర్రలు (Foxtail Millet) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలుసు.. కానీ.. చాలా మంది వీటికి దూరంగా ఉంటారు.. కానీ.. ఈ ధాన్యం లోతైన ప్రయోజనాలను, వాటిని ఎలా సక్రమంగా వినియోగించుకోవాలో తెలుసుకుంటే.. అస్సలు వదలరంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొర్రలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసే పంట.. అయితే.. కొర్రలు ఎందుకు తినాలి.. తింటే.. కలిగే లాభాలేంటి అనే వివరాలను ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకోండి..

పీచుపదార్థం – ప్రాముఖ్యత

కొర్రలలో అధిక మొత్తంలో పీచుపదార్థం (ఫైబర్) ఉంటుంది. దాదాపు 8%. దీనిని పాలిష్ చేసిన బియ్యంతో పోల్చితే, బియ్యంలో కేవలం 0.3% నుంచి 0.5% మాత్రమే ఫైబర్ ఉంటుంది. కొర్రలలో ఉండే అధిక ఫైబర్ రెండు రకాలుగా ఉంటుంది.. కరిగే ఫైబర్ (సాల్యుబుల్ ఫైబర్), కరగని ఫైబర్ (ఇన్సాల్యుబుల్ ఫైబర్).

కరిగే ఫైబర్ మనం ఆహారం తీసుకున్న తర్వాత, జీర్ణం అయి లిక్విడ్‌లో కలిసి, చివరికి రక్తంలో కూడా ప్రవేశిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కరగని ఫైబర్ రక్తంలోకి ప్రవేశించదు కానీ, జీర్ణవ్యవస్థలోని విల్లైస్ (పేగులలోని చిన్న నిర్మాణాలు)ను శుభ్రపరచడంలో చీపురు వలె పనిచేస్తుంది. ఇది ఆహారం అతుక్కోకుండా చూస్తుంది.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది.

ఆధునిక ఆహారపు అలవాట్లు, ఫైబర్ లోపం

ప్రస్తుతం చాలామంది ఫైబర్ లేని ఆహారాలను – మైదా ఉత్పత్తులు, బ్రెడ్‌లు, పిజ్జాలు, చీజ్‌లు వంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటివి సర్వసాధారణం అయ్యాయి. అమెరికాలో కొలొన్ క్యాన్సర్ కేసులు పెరగడానికి ఫైబర్ లేని ఆహారపు అలవాట్లు ఒక ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అక్కడ ఫైబర్ మాత్రలు వాడమని సూచిస్తున్నారు.. కానీ ఆహారంతో పాటు సహజంగా లభించే ఫైబర్‌తోనే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. కొర్రలు వంటి ధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అధిక ఫైబర్‌ను అందిస్తాయి.

కొర్రల సాగు – నిల్వ ప్రయోజనాలు

కొర్రల సాగుకు పెద్దగా ఖర్చు అవసరం లేదు. రాయలసీమ వంటి వర్షాధారిత ప్రాంతాల్లో రెండు, మూడు వర్షాలు పడితే చాలు, ఈ పంట పండుతుంది. అధిక వర్షపాతం, ఎక్కువ ఎరువులు, అధిక ఉష్ణోగ్రతలు వంటి ప్రత్యేక పరిస్థితులు అవసరం లేదు. పంట కోసిన తర్వాత, దాని సొప్పు పశువులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, కొర్రలు తింటే తక్కువ పరిమాణంలోనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఉదాహరణకు, బియ్యం ఇడ్లీలు ఆరు తింటే, కొర్రల ఇడ్లీలు రెండు తింటే సరిపోతుందని మెదడు సూచిస్తుంది. దీనికి కారణం కొర్రలలో ఉండే అధిక ఫైబరే. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది.

పర్యావరణ అనుకూలత – ఆహార భద్రత

కొర్రలకు పురుగులు పట్టవు, మందులు కొట్టే అవసరం లేదు. కోసిన గింజలను బాగా ఎండబెట్టి నిల్వ చేసుకుంటే పదేళ్లు అయినా చెడిపోవు. దీనికి కరెంటుతో నడిచే గిడ్డంగులు, ప్రత్యేక నిల్వ ఏర్పాట్లు అవసరం లేదు. ప్రకృతి మనకు అందించిన బయో-డైవర్సిఫైడ్ ఆహారాల్లో కొర్రలు ఒకటి. ప్రాసెసింగ్ తక్కువగా ఉండే ఈ ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫ్రీజ్ చేసిన ఆహారాలు వాటి పోషక విలువలను కోల్పోతాయి. కొర్రల వంటి సహజ సిద్ధమైన ధాన్యాలు మనకు ఇమ్యూనిటీని పెంచి, అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. కొర్రలు కేవలం ఒక ఆహార ధాన్యం మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన జీవనశైలికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఒక జీవన విధానం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us