Egg Samosa Recipe: పిల్లలు గుడ్డు తినడం లేదా? 15 నిమిషాల్లో క్రిస్పీ ఎగ్ సమోసా చేసి పెట్టండిలా!

సమోసా అనగానే సాధారణంగా మనకు బంగాళదుంప లేదా ఉల్లిపాయ సమోసాలే గుర్తుకొస్తాయి. అయితే ప్రతిరోజూ గుడ్లు తినడానికి మారాం చేసే పిల్లల కోసం బలమైన పోషకాలతో కేవలం 15 నిమిషాల్లో చేసుకోగలిగే అద్భుతమైన వంటకం 'గుడ్డు సమోసా'. ఇది బయట ఎంతో కరకరలాడుతూ, లోపల నోరూరించే స్పైసీ ఎగ్ స్టఫింగ్‌తో సరికొత్త రుచిని ఇస్తుంది. ముఖ్యంగా చల్లని సాయంత్రం వేళ వేడి వేడి చాయ్‌తో పాటు ఈ వెరైటీ సమోసాను వడ్డించడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Egg Samosa Recipe: పిల్లలు గుడ్డు తినడం లేదా? 15 నిమిషాల్లో క్రిస్పీ ఎగ్ సమోసా చేసి పెట్టండిలా!
Egg Samosa Recipe

Updated on: Jun 10, 2026 | 12:16 PM

చిన్నారుల ఎదుగుదలకు గుడ్డులోని ప్రోటీన్లు ఎంతో అవసరం. కానీ చాలా మంది పిల్లలు ఉడికించిన గుడ్డును తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారి కోసం సాయంత్రం పూట వేడివేడిగా ఈ ఎగ్ సమోసాను చేసి పెడితే ఒక్కటి కూడా వదలకుండా తింటారు. వర్షాకాలంలో లేదా చల్లని వాతావరణంలో వేడి సమోసాలను పుదీనా చట్నీ లేదా టమాటో సాస్‌తో తింటే ఆ రుచే వేరు. మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవడం ద్వారా దీనిని మరింత ఆరోగ్యకరమైన చిరుతిండిగా మార్చుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు: 3 లేదా 4 (ఉడికించినవి)

మైదా లేదా గోధుమ పిండి: 1 కప్పు

ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)

పచ్చిమిరపకాయలు: 2 (చిన్న ముక్కలుగా చేసినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

సోంపు గింజలు: 1/2 టీస్పూన్

మసాలాలు: పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి (అన్నీ అర చెంచా)

చికెన్ మసాలా పొడి: 1/2 టీస్పూన్ (మంచి సువాసన కోసం)

కొత్తిమీర తరుగు: కొద్దిగా

ఉప్పు నూనె: తయారీకి తగినంత

ఎగ్ సమోసా తయారీ విధానం

ముందుగా కోడిగుడ్లను కుక్కర్‌లో వేసి పర్ఫెక్ట్‌గా ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తర్వాత వాటి పెంకులను పూర్తిగా వలిచేసి, క్యారెట్ తురిమే బ్లేడ్‌తో గుడ్డు సన్నగా తురుముకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక సోంపు గింజలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేపాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా తురిమిన గుడ్డు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు తక్కువ మంటపై వేయించి స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి.

సమోసా పట్టీలు చేయడం
ఒక గిన్నెలో మైదా పిండి, కొద్దిగా ఉప్పు, ఒక చెంచా వేడి నూనె తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి. ఆ చపాతీలను మధ్యలోకి కట్ చేసి త్రిభుజాకారంలో కోన్ లాగా మడతపెట్టాలి. ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు మసాలా స్టఫింగ్‌ను ఉంచి, అంచులు ఊడిపోకుండా కొద్దిగా నీటి తడితో గట్టిగా మూసివేయాలి. చివరగా బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా మరిగించాలి. నూనె మీడియం వేడిలో ఉన్నప్పుడు ఈ సమోసాలను ఒక్కొక్కటిగా వేస్తూ, మంచి బంగారు గోధుమ రంగు (Golden Brown) వచ్చేంత వరకు అటుఇటు తిప్పుతూ క్రిస్పీగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే… వీటిని టమాటో కెచప్‌తో పిల్లలకు ఇస్తే మొత్తం తినేస్తారు.

Follow Us