
రోజూ తినే కూరలు బోర్ కొట్టినప్పుడు లేదా టిఫిన్స్‌లోకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు టమాటా పుదీనా పచ్చడి బెస్ట్ అప్షన్ అవుతుంది. అన్నం, ఇడ్లీ, దోశ లేదా వడ.. ఇలా దేనిలోకైనా ఇట్టే కలిసిపోయే అద్భుతమైన రుచి టమాటా పుదీనా పచ్చడి. పుదీనాలోని సుగంధం, టమాటాలోని పులుపు కలిసి ఈ పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. దీనిని తయారు చేయడం చాలా సులభం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, పూర్తి తయారీ విధానం ఇక్కడ చూడండి..
టమాటా, పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
టమోటాలు: 3-4 (పెద్దవి)
పుదీనా ఆకులు: ఒక కప్పు
పచ్చిమిర్చి: 5-6 (మీ కారానికి తగినట్లు)
అల్లం ముక్క: చిన్నది
వెల్లుల్లి రెబ్బలు: 4-5
చింతపండు: చిన్న నిమ్మకాయంత
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు.
తయారీ విధానం: ముందుగా ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో టమాటా ముక్కలు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు మగ్గించాలి. వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, ఉడికించిన టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేయాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గరిటెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును పచ్చడిలో కలిపేస్తే నోరూరించే టమోటా పుదీనా పచ్చడి రెడీ!
ఈ పచ్చడి కేవలం రుచికి మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. పుదీనా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. టమాటాల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..