కోడి గుడ్డు.. పోషకాల పవర్ హౌస్.. రోజుకో గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు.. గుడ్డును మీ ఆహారంలో చేర్చుకోవటం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు..కేవలం ఉడకబెట్టి తినేయొచ్చు. ఉదయాన్నే గుడ్డు తినడం మంచి బ్రెక్‌ఫాస్ట్ అవుతుంది. అయితే, చాలా మంది గుడ్డులోని పచ్చ సొనను బయట పడేస్తుంటారు. అయితే ఇది తప్పు అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే అని చెబుతున్నారు. రోజుకు ఒక పచ్చ సొన తినడం వల్ల ఎవరూ బరువు పెరిగిపోరు. కాబట్టి రోజుకో పచ్చసొనను తినడం చాలా అవసరం. పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టకుండా తింటారు.
గుడ్డు, ప్రోటీన్ ఉత్తమ వనరులలో ఒకటి. కాల్షియం, విటమిన్ B2, B12, విటమిన్ A, D, అయోడిన్, సెలీనియం, బయోటిన్, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంది. కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుడ్లు తినడం మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పైభాగంలో మాత్రమే కాదు, దాని పసుపు భాగం అంటే పచ్చసొనలో జింక్, ఫాస్పరస్ సహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. జలుబు, దగ్గు విషయంలో గుడ్లు తినడం చాలా ప్రయోజనకరం. అలాగే, గుడ్డులోని పచ్చసొనలో మనకు అవసరమైన పది రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గుడ్డును తినడం వల్ల మన శరీర అవసరాల్లో 15శాతం పోషకాలు అందుతాయని చెబుతున్నారు.
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుడ్డులోని పచ్చసొనలోనే విటమిన్ డి మూలాలు ఉంటాయి. ఇది ఆస్టియోపొరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.
గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రావమై ప్రాణాపాయం కలుగుతుంది. ఇలా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ Kకు ఉంది. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 2 నుండి 3 గుడ్లు తినవచ్చు. అయితే ఇది శరీర బరువు, వయస్సు, జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది. గుడ్డులో మంచి కాల్షియం ఉంటుంది. కాబట్టి దాని వినియోగం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు శక్తిని పెంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. గుడ్డు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టు, గోళ్లను బలంగా ఉంచుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..