
కొత్తిమీర చట్నీని అనేక పద్ధతుల్లో చేస్తారు, కానీ ఈ ‘చెట్టినాడు’ స్టైల్ చట్నీ చాలా ప్రత్యేకం. ఇందులో వాడే చిన్న ఉల్లిపాయలు చట్నీకి మంచి తీపిని, వెల్లుల్లి మంచి సువాసనను అందిస్తాయి. దీనిని తయారు చేయడం చాలా సులభం సమయం కూడా తక్కువే పడుతుంది. మీరు ఎప్పుడూ చేసే రొటీన్ చట్నీలకు బదులుగా, ఈసారి ఈ స్పెషల్ కొత్తిమీర-చిన్న ఉల్లిపాయ చట్నీని ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
నూనె, మినప్పప్పు
ఎండు మిరపకాయలు (2),
పచ్చిమిర్చి (2)
చిన్న ఉల్లిపాయలు (15),
వెల్లుల్లి (8 రెబ్బలు)
చింతపండు (చిన్న ముక్క)
కొత్తిమీర (1 గుప్పెడు),
కొబ్బరి తురుము (1/2 కప్పు)
పోపు కోసం: ఆవాలు,
జీలకర్ర పొడి, కరివేపాకు
తయారు చేసే విధానం:
ముందుగా ఒక పాన్ లో నూనె వేసి, మినప్పప్పును దోరగా వేయించాలి. ఆపై ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.
తర్వాత పచ్చిమిర్చి, చింతపండు వేసి కొద్దిసేపు వేయించి, శుభ్రం చేసుకున్న కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర కొద్దిగా వాడగానే స్టవ్ ఆఫ్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడిపైనే కొబ్బరి తురుము వేసి కలిపి చల్లారనివ్వాలి.
చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
చివరగా ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి జీలకర్ర పొడితో పోపు పెట్టుకుని చట్నీలో కలిపితే రుచికరమైన కొత్తిమీర చట్నీ సిద్ధం.