
వంటింట్లో ఉల్లిపాయ లేనిదే ఏ వంటా పూర్తి కాదు. అయితే ఇటీవల మార్కెట్లో దొరికే ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు లేదా నల్లటి పొడి వంటి పదార్థం కనిపిస్తోంది. చాలామంది దీనిని మామూలు ధూళి అని భావించి కడిగేసి వాడుతుంటారు. కానీ ఆ నల్లటి మచ్చల వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ మచ్చలు కేవలం మురికి కాదని, అవి ఒక రకమైన ప్రమాదకరమైన ఫంగస్ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలపై కనిపించే ఈ నల్లటి పొడిని శాస్త్రీయంగా ఆస్పెర్‌గిల్లస్ నిగ్రి అని పిలుస్తారు. సాధారణ భాషలో దీనిని నల్ల బూజు అంటారు. ఉల్లిపాయలు పండించేటప్పుడు లేదా నిల్వ చేసేటప్పుడు తేమ శాతం పెరిగినా, గాలి వెలుతురు సరిగ్గా లేకపోయినా ఈ శిలీంధ్రం వేగంగా వ్యాపిస్తుంది. ఇది చూడటానికి బొగ్గు పొడి చల్లినట్లుగా ఉల్లిపాయ పైపొరలపై పేరుకుపోతుంది.
ఈ నల్ల బూజు వల్ల కలిగే నష్టాలు సామాన్యమైనవి కావు.. ఈ శిలీంధ్రం ఓక్రాటాక్సిన్ ఏ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తే కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలెర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారు ఈ బూజు పట్టిన ఉల్లిపాయలను తాకినప్పుడు, ఆ బీజాంశాలు గాలిలోకి విడుదలయ్యి శ్వాసనాళాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
నల్ల మచ్చలు ఉన్న ప్రతి ఉల్లిపాయను పారేయక్కర్లేదు. కానీ ఎలా వాడాలో తెలియాలి. నల్లటి పొడి కేవలం పైన కాగితం లాంటి పొరలకే ఉండి, లోపల ఉల్లిపాయ గట్టిగా ఉంటే.. ఆ పొరలను తీసేసి, ఉల్లిపాయను బాగా కడిగి వాడుకోవచ్చు. ఒకవేళ ఆ నల్లటి మచ్చలు లోపలి పొరల్లోకి వెళ్లినా, ఉల్లిపాయ మెత్తబడి జిగురుగా అనిపించినా లేదా చెడు వాసన వస్తున్నా.. దానిని వెంటనే పారేయడం ఉత్తమం.